– కేంద్ర ప్రభుత్వ విధానాలను సాయుధ పోరాట స్పూర్తితో తిప్పికొడదాం
– సీతారాం ఏచూరి ఆశయ సాధనకు కృషి చేద్దాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి
నవతెలంగాణ-నిర్మల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని వక్రీకరించి, ప్రజల మధ్య చీలికలు తెస్తున్న బీజేపీ విధానాలను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముందుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లలర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడారని తెలిపారు. పాలకుర్తి గ్రామంలో చుట్టుపక్కల ప్రజలను చైతన్యపరిచి నైజం అరాచకాలను, తిప్పుకొట్టడానికి ధైర్యంతో ముందుకెళ్లిన వీరనారి చిట్యాల ఐలమ్మ ధీరత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులన్నారు. మతోన్మాద బీజేపీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోరాటాన్ని హిందూ ముస్లిం పంచాయితీలాగా మారుస్తుందని అన్నారు. చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరని తెలిపారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేయాలని మోడీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణ మాఫీ చేయాలని తెలిపారు. రైతుబంధు వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ డిక్లరేషన్స్ అమలు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్స్ పెంచుతామని హామీ ఇచ్చి 10నెలలు అయినా పెంచడం లేదన్నారు. రాష్ట్రంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. దళిత, గిరిజన మహిళలపై లైంగికదాడులు, వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా 3వ మహాసభ నిర్వహణ కోసం ప్రజలు, వ్యాపారస్థులు, పట్టణ ప్రముఖులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొమ్మెన సురేష్, బి.సుజాత, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంభు, జిల్లా నాయకులు ఫసివుద్దీన్, ప్రసాద, లలిత, రాజమణి, శైలజ, నాయకులు పాల్గొన్నారు.