‘తిండైనా పెట్టండి .పనైనా చూపండి’ అనే డిమాండ్‌తో వామపక్షాలు దేశవ్యాప్తంగా చేసిన ప్రజా పోరాటాల ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి వంద రోజుల పని గ్యారెంటీ చేస్తూ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. నేడు 716 జిల్లాలు, 7168 బ్లాకులు/మండలాలు, 2,69,453 గ్రామ పంచాయతీలలో ఈ చట్టం అమలవుతున్నది. 90శాతం కేంద్ర ప్రభుత్వం, 10శాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతో ఈ చట్టం ద్వారా ఉపాధి పనిని చూపాలి. ఇప్పటికే 32 కోట్ల మంది గ్రామీణ పేదలు దరఖాస్తు పెట్టుకొని ఉన్నారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత భూస్వాములు, పెట్టుబడిదారుల ఒత్తిడి మేరకు ఈ చట్టం ప్రకారం పేదలకు పని కల్పించడానికి సిద్ధపడటం లేదు. చట్ట ప్రకారం దరఖాస్తు పెట్టుకున్న కూలీలకు పని కల్పించడం, చేసిన పనికి వేతనాలు చెల్లించడం, పనికి వచ్చిన కూలీలకు మస్టరు వేయడం, కొత్త పనులు ఎంపిక చేయడం, కొత్తగా జాబ్ కార్డులు ఇవ్వడం, పేర్లు మార్పులు చేర్పులు చేయడం వంటి అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఈ అధికారాలు అన్నింటిని కేంద్ర ప్రభుత్వం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ (ఎన్ఎంఎంఎస్) మొబైల్ యాప్ పేరుతో తన చేతిలోకి తీసుకున్నది. కూలీల జాబ్‌కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ మొబైల్ నెంబరు ఆన్లైన్ అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. పని ప్రదేశంలో ఉదయం ఏడు గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు కూలీల ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే చేసిన పనికి వేతనాలు ఇస్తామని నిబంధన విధించింది. ఇది చర్య రాజ్యాం గంలోని ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి వ్యతిరేకమైనది. గతంలో ఉన్న పనుల సంఖ్యను గురించి కేంద్ర ప్రభుత్వం చెప్పిన 20 పనులు మాత్రమే ఎంపిక చేయాలని నిర్దేశించింది. ఇంటర్నెట్ సర్వీస్, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లులేని రిమోట్ ప్రాంతాలలో ఉన్న గ్రామాలు, ఆదివాసి గిరిజన ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం కల్పించే పనికి అనివార్యంగా దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. పని చేసిన దగ్గర కూలీల ఫొటోలు అఫ్లోడ్ చేసేటప్పుడు సిస్టంలో టెక్నికల్ సమస్యలు ఎదురై ఫొటో అప్లోడ్ కాకుంటే వేతనాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతున్నాయి కూలీల వేతనాలు చెల్లించాలి అనే చట్టం డైరెక్షన్ దీని వల్ల అమలు కావడం లేదు నాలుగు వారాల నుండి పది వారాల వరకు కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చర్య రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమైనది. రాష్ట్రాల హక్కులను ప్రత్యక్షంగా హరించడమే.
కూలీలకు పని తగ్గించారు- కాంట్రాక్టర్లకు పెంచారు
గ్రామీణ ఉపాధి పనిలో చట్ట ప్రకారం యంత్రాలు వాడకూడదు. ఆన్‌స్కిల్ లేబర్‌కు మాత్రమే పని కల్పించాలి అని ఉన్న డైరెక్షన్ నాటి కాంగ్రెస్ నేడు మోడీ ప్రభుత్వాలు ప్రజాధనాన్ని గ్రామీణ ప్రాంత పేదలకు డైరెక్టుగా ఇవ్వడం తట్టుకోలేని గ్రామీణ భూస్వామ్య కాంట్రాక్టర్ల వత్తిడికి లొంగిపోయాయి. పదిశాతంగా ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ నిధులను యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 22శాతానికి పెంచింది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని 49శాతానికి పెంచారు. దీనితో ప్రజలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో కేటాయించిన నిధులలో అధిక భాగం సీసీ రోడ్లు, రైతు వేదికలు, కల్లాలు, వైకుంఠధామాలు, అంగన్వాడీ బిల్డింగులు, స్వచ్ఛ భారత్ బాత్రూముల నిర్మాణాలు వంటి కాంట్రాక్ట్ పనులకు నిధులను డైవర్ట్ చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. విరివిగా యంత్రాలను వాడుతున్నారు. మరొకవైపు మోడీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులను భారీగా కొత్త విధిస్తూ వస్తున్నది. 2021-2022లో 98,467 లక్షల కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ 2023-24 నాటికి 63,000 లక్షల కోట్లకు కుదించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా 15కోట్ల 78లక్షల జాబ్ కార్డులలోని పేర్ల నమోదు చేసుకున్న 32కోట్ల మంది కూలీలు ఉంటే కేవలం 9.95కోట్ల జాబ్ కార్డులలోని 15.78కోట్ల మంది కూలీలకు మాత్రమే పని కల్పించినట్లుగా గత సంవత్సర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. అంటే 50శాతం మందికి కూడా కేంద్ర ప్రభుత్వం పని చూప లేకపోయింది. రాష్ట్రంలో కూడా ఇదే స్థితి నెలకొన్నది. 57.17లక్షల జాబు కార్డులలో కోటి 20లక్షల మందికి పైగా పని కోసం పేర్లు నమోదు చేసుకొని ఉంటే కేవలం 36.73లక్షల జాబ్ కార్డుల లోని 65లక్షల మందికి మాత్రమే పని చూపినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. పని చేయడానికి సిద్ధంగా ఉన్న పేదలందరికీ పని కల్పించుటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయి. పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలి అనే చట్టం డైరెక్షన్‌ను అమలు చేయకుండా ప్రభుత్వాలు ఉల్లం ఘిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బడ్జెట్లో నిధులు కోత విధించడమే.
అమలు కానీ కనీస వేతనం – కనపడని కనీస సౌకర్యాలు
నిత్యావసర సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల కనుగుణంగా కనీస వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదు. గత సంవత్సరం రోజు కూలీ 245 ఉన్నదాన్ని రూ.272కు పెంచింది. ఇది కూడా మన రాష్ట్రంలో ఎక్కడ అమలు కావడం లేదు. మీటరు లోతు, మూడు మీటర్లు వెడల్పు, పొడవు క్యూబిక్ మీటర్లు తవ్వితేనే చట్ట ప్రకారం వేతనాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆచరణలో దొంగ కొలతలు వేసి వేతనాల్లో భారీకోత విధిస్తున్నారు. రాష్ట్ర అధికారులు చెప్పే లెక్కల ప్రకారం కనీస వేతనం యావరేజ్ కూలీ రూ.125 దాటడం లేదు. విడివిడిగా పరిశీలన చేస్తే కూలి పొందుతున్న వారే అధికంగా ఉన్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 20 నుండి 60శాతం వరకు కనీస వేతనానికి అదనంగా ఇచ్చే సమ్మర్ అలవెన్స్, ఐదు కిలోమీటర్ల వరకు పని ప్రదేశానికి వెళ్లి రావడానికి ఇచ్చే లోకల్ ఆటో చార్జీలు, గడ్డపార సాన పట్టుకోడానికి ఇచ్చే చార్జీలను ప్రభుత్వం ఎత్తివేసింది. అర కొరగా పడే కూలి రోజువారి ఖర్చులకు సరిపోక పోగా అదనంగా కూలీలు తమ జేబులో నుండి పెట్టుబడి పెట్టుకుంటే తప్ప ఉపాధి పని చేసే అవకాశం లేదు. మరొకవైపు చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన నీడకు టెంట్, తాగడానికి మంచినీళ్లు, ఏవైనా ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్సకు మెడికల్ కిట్టు, చిన్నపిల్లల సంరక్షణకు ఆయాను ఉంచాల్సిన పద్ధతిని అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం దంపతులకు పార, గడ్డపార, తట్ట, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లను ఇవ్వడం ఆపేశారు. వారం వారం పేమెంట్, పేస్లిప్ ఇవ్వడం కనుమరుగయ్యాయి. ఎంత కూలీ పడుతుంది. డబ్బులెప్పుడు వస్తాయి అనేది కూలీలకు తెలియకుండా అయిపోయింది. గత సంవత్సరం చేసిన పనికి నేటికీ అమౌంట్ రాక ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కూలీలు ఇబ్బంది పడుతు న్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో కూలీలు పనికి దొరకడం లేదని, కూలీ రేట్లు పెరుగుదల రైతు వ్యవసాయ పెట్టుబడికి భారంగా మారిందని భూస్వాములు గగ్గోలు పెడు తున్నారు. ఉపాధిó పనులను వ్యవసా యానికి అనుసంధానం చేయాలని భూస్వాముల వాదనను రాష్ట్ర ప్రభుత్వం భుజాన వేసుకోవడం అర్థరహితమైనది.
వామపక్ష ప్రభుత్వాల మాదిరి ‘పట్టణ ఉపాధి’ పెట్టాలి
అధికారంలో ఉన్న పాలకులు తమ అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాలను పట్టణాల్లో విలీనం చేయడం వలన గ్రామీణ ఉపాధి హామీ పనికి దూరం అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో 702 గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో విలీనం చేయడం వలన సుమారుగా మూడు లక్షల మంది కూలీలు ఉపాధి పనికి దూరమయ్యారు. దేశంలో పట్టణ ప్రాంతాలలో పేదలకు ఉపాధి పని అమలు చేస్తున్న రాష్ట్రాల వివరాలు కావాలని సీపీఐ(ఎం) ఎంపీ శివదాసన్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ సహాయం మంత్రి కౌసిల్ కిషోర్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో కేరళ అయంకాలి పట్టణ ఉపాధి కార్యక్రమం – 2010, త్రిపుర పట్టణ ఉపాధి కార్యక్రమం-2009, పశ్చిమ బెంగాల్ పట్టణ ఉపాధిó పథకం- 2010లను వామపక్ష ప్రభుత్వాలు తీసు కొచ్చాయని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వాలే తమ బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేస్తున్నాయని చెప్పారు. వీటితో పాటుగా ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ 2010 నుండి, రాజస్థాన్‌లో 2022 నుండి అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పట్టణ పేదలకు ఉపాధి హామీ పని పెట్టాలని కేంద్ర ప్రభుత్వా నికి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి మాత్రం ఆలోచన చేయకపోవడం విచారకరం. పట్టణ పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే, పట్టణ పేదలకు పని కల్పించడానికి ప్రత్యేక చట్టాన్ని తేవాలి. రోజు కూలీ రూ.600, పనిదినాలు 200రోజులకు పెంచే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి.
– బి. ప్రసాద్