బీజేపీ నేత కిరీట్‌ సోమయ్య అభ్యంతరకర వీడియో వైరల్‌..

నవతెలంగాణ – ముంబై:  బీజేపీ నేత కిరీట్‌ సోమయ్యకు చెందిన అశ్లీల వీడియో బయటకురావడం రాజకీయ దుమారం రేపుతున్నది. అధికార బీజేపీ, కిరీట్‌ సోమయ్యపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, శివసేన (ఉద్ధవ్‌ వర్గం) తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అధికారపక్షం అసలు స్వరూపం బయటపడిందని విమర్శించాయి. మహిళలను వేధింపులకు గురిచేస్తున్న సోమయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. కిరీట్‌ సోమయ్య అభ్యంతరకర రీతిలో ఉన్న వీడియోను మరాఠా చానల్‌ పోస్ట్‌ చేసింది. ‘చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను కిరీట్‌ సోమయ్య బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అనేక మంది మహిళలను కూడా బ్లాక్‌మెయిల్ చేసినట్టు ఇప్పుడు బయటపడింది. నైతికత గురించి లెక్చర్లు ఇచ్చే బీజేపీ నేతలు ఇప్పుడు ఏం మాట్లాడుతారు? సోమయ్యపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? ’ అని కాంగ్రెస్‌ నాయకురాలు యశోమతి ఠాకూర్‌ ప్రశ్నించారు. సంబంధిత వీడియోపై సోమయ్య స్పందించారు. తాను ఏ మహిళనూ వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారు. వీడియోపై దర్యాప్తు జరిపించాలని ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. కాగా, ఎన్సీపీ నేతల అవినీతి గురించి తరచూ విమర్శలు చేసే కిరీట్‌ సోమయ్య.. ఇటీవల పలువురు ఎన్సీపీ నేతలు అధికార కూటమిలో చేరడంపై మాత్రం నోరుమెదపలేదు.

Spread the love