నన్ను క్షమించబోనని మోడీ అన్నారు: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్

నవతెలంగాణ – హైదరాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకపోవడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తాజాగా స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మోడీ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తనను క్షమించేది లేదని మోడీ గతంలోనే చెప్పారని వ్యాఖ్యానించారు. ‘‘గతంలోనూ నేను టిక్కెట్ ఆశించలేదు. ఇప్పుడూ టిక్కెట్ కోరుకోవట్లేదు. గతంలో నేను చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీకి నచ్చకపోయి ఉండొచ్చు. నన్ను క్షమించేది లేదని అప్పుడే అన్నారు. అయితే, నేను అప్పట్లో ప్రధానికి క్షమాపణలు చెప్పాను. నేను పార్టీలోనే కొనసాగుతా. నాకిచ్చిన బాధ్యతలను నిర్వహిస్తాను’’ అని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానని చెప్పారు. ప్రస్తుతం భోపాల్ ఎంపీగా ఉన్న ప్రజ్ఞకు బీజేపీ పార్టీ ఈసారి టిక్కెట్ కేటాయించలేదు. తొలి దశలో పార్టీ ప్రకటించిన 195 మంది అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. భోపాల్‌లో పార్టీ తరపున ఈసారి ప్రజ్ఞకు బదులు మాజీ మేయర్ అలోక్ శర్మను బీజేపీ బరిలోకి దింపింది.

Spread the love