– కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టడమే ప్రధాన లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు
నవతెలంగాణ-వెంకటాపురం/గోవిందరావుపేట
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొతినేని సుదర్శన్‌రావు అన్నారు. సీపీఐ(ఎం) ప్రజా చైతన్య యాత్ర ఆదివారం మధ్యాహ్నం వెంకటాపురం చేరుకుంది. వెంకటాపురం మండలం ప్రారంభం నుంచి అబేద్కర్ సెంటర్ వరకు సుమారు 500పైగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామం నుంచి బయలుదేరిన బస్సు చైతన్య యాత్ర తాడ్వాయి, చిన్న బోయినపల్లి, ఎటూరు నాగారం మీదుగా వెంకటాపురం, వాజేడు మండలాల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ములుగు జిల్లాల్లోని ఆయా మండలాల్లో జరిగిన సభల్లో పోతినేని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టడంతో పాటు వారికి లక్షల కోట్ల రూపాయలు కట్టబెడుతూ ప్రజలపై భారాలను మోపుతున్నదని విమర్శించారు. దేశమంటే అంబానీ, అదానీలా సొత్తుగా మార్చేశారన్నారు. నూనెలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో సహా ఇతర అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెంచారన్నారు. 2014లో రూ.410 ఉన్న గ్యాస్ బండ ధర నేడు రూ.1250కు పెరిగిందన్నారు. ప్రభుత్వ భూములను, మార్కెట్లను పరిశ్రమలను, ఉపాధి కల్పించే ఇతర అన్ని రంగాలను కార్పొరేటీకరణ చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ మానవ అభివృద్ధి ఆకలి సూచీలో మన దేశం 141వ స్థానానికి దిగజారిందన్నారు. రైతాంగానికి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం రూ.6000 ఇస్తూ ఎరువులపై కోట్లలో సబ్సిడీని తగ్గించి రేట్లు పెంచి దోపిడీ కొనసాగిస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో కోతలు పెడుతూ కూలీల శ్రమను దోచుకుంటుందని వాపోయారు. పన్నువేసే అధికారాన్ని కేంద్రమే తీసుకొని రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వకుండా చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. వ్యవసాయ పంటలకు కనీసం మద్దతు ధరల చట్టం చేయాలని, ఏక కాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ఒకే భాష, ఒకే సంస్కృతి పేరుతో జ్యోతిషాన్ని, సంస్కృతాన్ని పాఠ్యాంశాలుగా మార్చి హిందేతర మతాలపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నదన్నారు. బీజేపీని ఓడించడం కోసం బీఆర్‌ఎస్‌తో జత కట్టినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలు చేయకుంటే పోరాటం తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పతనమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టినట్టు తెలిపారు. సీపీఐ(ఎం) చేపట్టిన వెంకటాపురంలో జరిగిన సభలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు తోట మల్లికార్జున రావు, బీఆర్‌ఎస్ నాయకులు పిల్లరి శిట్టి మురళి సంఘీబావం తెలిపారు. యాత్రలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి మచ్చ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బందు సాయిలు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.