ముస్లిం వివాహ చట్టం రద్దు..బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం

నవతెలంగాణ-హైదరాబాద్ : అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఇది రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు ముందడుగుగా పరిగణించబడుతోంది. అయితే, బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ మండల్ మాట్లాడుతూ.. హిమంత సర్కార్ ముస్లిం వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. వారు హిందువులకు అనుకూలంగా ఉన్నారని, ముస్లింలను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐయూడీఎఫ్ నేత రఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూసీసీని తీసుకువచ్చే ధైర్యం ప్రభుత్వానికి లేదని, ఇది ముస్లింలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.  ఇదిలా ఉంటే బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. కొత్త చట్టంతో రాష్ట్రంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో యూసీసీని తీసుకువచ్చామని, ఇప్పుడు అస్సాంలోని హిందువులు, ముస్లింలకు ఒకే చట్టం ఉంటుందని అన్నారు. బాల్యవివాహాలను అంతమొందించే ప్రయత్నమని బీజేపీ చెబుతోంది. అస్సాం క్యాబినెట్ శుక్రవారం అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల చట్టం-1935ని రద్దు చేయడానికి ఆమోదం తెలిపింది. చట్టం ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 కనీస వివాహ వయసు. అయితే, ముస్లిం వివాహ చట్టం ప్రకారం ఈ వయసు లేకున్నా వివాహం చేసుకునే నిబంధనలు దీంట్లో ఉన్నాయి, దీంతో బాల్య వివాహాలను నిర్మూలించే లక్ష్యంలో అస్సాం ఈ చట్టాన్ని రద్దు చేసిందన సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ ద్వారా ప్రకటించారు. బహుభార్యత్వానికి స్వస్తి పలికే బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు గతంలో సీఎం చెప్పారు.

Spread the love