తెలంగాణలో బీజేపీ దుకాణం బంద్‌

కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులు కరువు : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-లింగంపేట్‌
తెలంగాణలో త్వరలో బీజేపీ దుకాణం బంద్‌ అయితదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 40-50 స్థానాల్లో అభ్యర్థులు కరువయ్యారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 2 వేల పింఛన్‌ బంద్‌ అయితదన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్‌రావు హాజరయ్యారు. మండల కేంద్రంలోని శెట్పల్లి చౌరస్తా నుంచి వందలాది మంది బైక్‌ ర్యాలీతో మంత్రికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం భారీ బైక్‌ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా ఆగిపోతాయని అన్నారు. హస్తం అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని, పగటిపూట మూడు గంటలు.. రాత్రి నాలుగు గంటలు కరెంటు వస్తుందని, రాష్ట్రంలో మళ్లీ పైరవీకారులు, అవినీతి అధికారులు వస్తారని అన్నారు. మళ్లీ రైతులు ఎరువు బస్తాలకు క్యూలైన్లు కట్టే రోజులు వస్తాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. డబుల్‌ ఇంజన్‌ అని చెప్పుకునే బీజేపీ.. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని పూణే, నాగపూర్‌, సోలాపూర్‌ ప్రజలకు వారానికోసారి తాగునీరు అందిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో తెలంగాణ తరహా పథకాలు అమలు చేయాలని అక్కడ ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారని అన్నారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం త్వరలో ఇస్తామని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు త్వరలోనే ప్రారంభిస్తామని, డబుల్‌ కోటా పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. త్వరలోనే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తారని, వరాలజల్లు కురిపిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి నూకలు చెల్లాయని బీజేపీ నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అన్నారు.

Spread the love