– రాజకీయ పార్టీ కార్యాలయాలపై దాడిని సహించం
– ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యల పట్ల ఖండన: ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఎర్రుపాలెం
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దేశ సంస్కృతిని దిగజార్చే పరిస్థితి తెచ్చినందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలని విమర్శించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతర మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడే బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రమేష్ బిదోరి.. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మాటలను దేశంలో స్త్రీలపైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఎవరిపై దాడులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని చెప్పామని తెలిపారు. బీజేపీ కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఉప ముఖ్యమంత్రిగా తాను, టీపీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ఖండించా మన్నారు. కొంతమంది బీజేపీ నాయకులు దాడి గురించి వాస్తవాలుతెలుసుకోకుండా మాట్లాడుతు న్నారన్నారు. ముందుగా మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పండంతో పాటు సంస్కృతి, సంస్కారం నేర్పండని చురకలు అంటించారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేక తాత్కాలిక ఆవేశంతో కొంతమంది యువజన కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపైన దాడి చేశారని, దాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే బీజేపీ స్పందించి రమేష్ బిదోరిని సస్పెండ్ చేసి ఉండాల్సిందని, కానీ కనీసం స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ప్రోత్సహించేలా బీజేపీ కేంద్ర నాయకత్వం గాలికి వదిలేయడం తగదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గా ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.