అదానీ కోసమే బీజేపీ స్కెచ్‌

BJP sketch for Adani– ప్రజల భూముల్ని గుంజుకుని కట్టబెట్టే కుట్ర : కార్గిల్‌లో రాహుల్‌ గాంధీ
లద్దాక్‌ : లద్దాక్‌ ప్రజల భూముల్ని లాక్కొని.. అదానీ గ్రూపునకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. శుక్రవారం కార్గిల్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ భూములను లాక్కొని అదానీ గ్రూప్‌కి అప్పజెప్పేందుకు కాషాయపార్టీ కుట్ర చేస్తోంది. మీ భూముల్ని అదానీకి కట్టబెడితే ఆయన.. ఇక్కడ ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ ప్లాంట్‌ వల్ల వచ్చే లాభాల్ని మీకు పంచరు. మీ భూముల్ని అదానీ గ్రూపుకు ఇవ్వకుండా మీరే అడ్డుకోవాలి’ అని రాహుల్‌ లద్దాక్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. లద్దాక్‌ వ్యూహాత్మక ప్రదేశం. భారత భూభాగం గురించి.. ప్రధాని చెప్పేవన్నీ అసత్యాలే అని రాహుల్‌ పేర్కొన్నారు. కొద్దినెలల కిందట తాను చేపట్టన భారత్‌ జోడో యాత్రలో భాగంగా లద్దాక్‌కు చేరుకోవాలనుకున్నా.. అప్పుడు హిమపాతం కారణంగా ఈ ప్రాంతాన్ని సందర్శించలేకపోయినట్టు రాహుల్‌ చెప్పారు. అయితే ఈసారి బైక్‌పై లద్దాక్‌కు చేరుకుని యాత్ర కొనసాగించినట్టు రాహుల్‌ చెప్పారు.

Spread the love