త్రిపురలో బీజేపీ హింసాకాండ

మార్చి రెండవ తేదీన వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో బాగా తక్కువ తేడాతో అయినా బీజేపీ త్రిపురలో అధికారానికి వచ్చింది. ఆ ప్రకటన వెలువడింది మొదలు త్రిపురలో భయానక హింసాకాండ సాగుతోంది. పరిస్థితి ఇలా ఉంటుందని ముందుగా ఊహించిందే. మార్చి 6 నాటికి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ముఠాలు పాల్పడిన దాడులు, హింసాత్మక సంఘటనలు దాదాపు వెయ్యివరకు ఉన్నాయి. సీపీఐ(ఎం), వామపక్ష సంఘటన, కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులపై భౌతిక దాడులు జరిగాయి. వారి ఇండ్లను తగలబెట్టారు. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. అన్నింటికంటే అత్యంత హేయమైన, విషపూరితమైన దాడి ఏమిటంటే ప్రజల జీవనోపాధులను దెబ్బ తీయడం. రబ్బరు తోటలు, పంటలను తగల బెట్టడం, వారి ఇ-రిక్షాలను, వాహనాలను తిరగడానికి వీల్లేకుండా ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. 2018 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఇదే తరహాలో హింస, భయోత్పాతం చోటుచేసుకుంది. వామపక్షాల కార్యకర్తల కుటుంబా లను బెదిరించడం, బలవంతంగా వసూళ్ళకు పాల్పడడం వంటి చర్యలతో ఐదేండ్లూ పాలకపార్టీ ఇదే తరహా అణచివేతను కొనసాగించింది. ఈ కాలంలో సీపీఐ(ఎం) సభ్యులు, మద్దతుదారులు 25మంది హత్యకు గురయ్యారు. ఈసారి, ప్రతిపక్షాలను అణచి వేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వామపక్షాలు, కాంగ్రెస్‌కు కలిపి 35శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. మరోవైపు బీజేపీ సీట్లు, ఓట్లు రెండూ కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తీవ్ర ఆగ్రహం, నిరాశా నిస్పహలతో బీజేపీ ఇంత విచ్చలవిడిగా ఈ దాడులకు పాల్పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో పాలకపార్టీ గెలిచినప్పటికీ ప్రతి పక్షంపై ఎందుకింత తీవ్రంగా, ఉధృతంగా దాడులకు తెగబడుతోందని త్రిపుర వెలుపల ప్రజలు ప్రశ్నించవచ్చు. ఇక్కడే వర్గ కోణం ముందుకు వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగానే, త్రిపురలో కూడా దశాబ్దాల తరబడి సాగించిన ప్రజా ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే కమ్యూనిస్టు ఉద్యమం నిర్మితమైంది. సీపీఐ(ఎం) నిర్మాణాన్ని ధ్వంసం చేయడం, ఆ పార్టీకి మద్దతుగా ఉన్న ప్రజలను భయకంపి తులను చేయడమే లక్ష్యంగా త్రిపురలో అణచివేత, హింస కొనసాగించా లన్నది బీజేపీ ప్రణాళికగా ఉంది. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా… కమ్యూనిస్టు, వామపక్ష ఉద్యమంపై ఈ వర్గ దాడి కొనసాగుతోంది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని నాశనం చేయాలన్నదే దాని లక్ష్యం. ఈ నెల 8వ తేదీన రెండవసారి ముఖ్య మంత్రిగా ప్రమాణం చేసిన మాణిక్‌ సాహా ఈ సంఘటనలపై స్పందించిన తీరును బట్టే ఈ మొత్తం హింసాకాండ వెనుక పాలక పార్టీగా బీజేపీ హస్తం ఉందనేది స్పష్టమవు తోంది. కొన్ని బాధిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత, సాహా మాట్లా డుతూ… ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు, స్వార్థ ప్రయోజనాలు కలిగిన కొంతమంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. అంటే ఇక్కడ బీజేపీని అప్రతిష్ట పాల్జేయడానికి సీపీఐ(ఎం), ఇతర ప్రతి పక్షాల కార్యకర్తలు తమ స్వంత ఇళ్ళకు, దుకాణా లకు, కార్యాలయాలకు తామే నిప్పంటించు కుంటు న్నారన్నమాట! 2018కి ముందు తమ హయాంలో సీపీఐ(ఎం), వామపక్ష సంఘటన కలిసి ప్రతి పక్షాన్ని అణచివేయడానికి ప్రయత్నించాయని దూషణలకు దిగడం మరోఎత్తుగడ. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ తరహా అసత్యపు ప్రచారానికి పాల్పడ్డారు. త్రిపుర ఎన్నికల ప్రచార సభల్లో ఏవైతే మాట్లాడారో, అవే మాటలు మార్చి 2వ తేదీ సాయంత్రం న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాల్లో కూడా ప్రతిధ్వనించాయి. గతంలో ఒక పార్టీ జెండా మాత్రమే అగర్తలా, ఇతర చోట్ల ఎగరడానికి ఎలా అనుమతించబడిందనేది మోడీ పదే పదే చెప్పారు. మరే ఇతర పార్టీ పతాకమైనా ఎగరేయాలని అనుకునేవారు హింసాత్మక దాడులను ఎదుర్కొనాల్సి ఉండేదన్నారు. అలా పాలక పార్టీగా సీపీఐ(ఎం) నియంతృత్వం గురించి బీజేపీ పదే పదే మాట్లాడుతున్నదంతా ప్రస్తుత వాస్తవిక పరిస్థితుల ముందు పూర్తిగా తేలిపోయింది. ఉదాహరణకు వామపక్ష సంఘటన ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జెండాలు, బ్యానర్లు, హౌర్డింగ్‌లు ఏర్పాటు చేయడం అనేకమంది పరిశీలకులను విస్మయపరిచింది. అంతకు ముందు కూడా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ ఉన్నపుడు, అగర్తలా చుట్టుపక్కల కాంగ్రెస్‌ జెండాలు ప్రధానంగా ఎగిరేవి. బీజేపీ పాలనలో 2021 నవంబరులో అగర్తలా మున్సిపల్‌ ఎన్నికలు జరిగినపుడు రిగ్గింగ్‌ దారుణంగా జరిగింది. 51 సీట్లకు 51 సీట్లూ బీజేపీనే గెలుచుకుంది. కానీ 1995 డిసెంబరులో, లెఫ్ట్‌ ఫ్రంట్‌ హయాంలో ఎన్నికలు జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో మెజారిటీ సంపాదించింది. ఆ తర్వాత కూడా, కార్పొరేషన్‌ లో కాంగ్రెస్‌ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు గెలుచుకుంటూ వచ్చింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 40శాతానికి పైగా ఓట్లు దక్కించుకుంది. గత ఐదేండ్లలో బీజేపీ పాలనలో ప్రతిపక్ష పార్టీల హక్కులు పూర్తిగా తిరస్కరించబడ్డాయి. ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కులు దారుణ అణచివేతకు గురయ్యాయి. ఈ ఐదేండ్లలో 16మంది సీపీఐ(ఎం) ఎంఎల్‌ఎలు తాము ఎన్నికైన చోట సాధారణ కార్యకలాపాలు సైతం నిర్వహించ లేకపోయారు. ప్రజాప్రతినిధులుగా తమ నియోజక వర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేకపోయా రంటేనే నిరంకుశ-ఫాసిస్ట్‌ వ్యవస్థ త్రిపురలో ఎంతలా పాతుకుపోయిందో అంచనా వేయవచ్చు. 2021 సెప్టెంబరులో తన నియోజకవర్గంలో బ్లాక్‌ స్థాయిలో ప్రజా ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రతిపక్ష నేత మాణిక్‌ సర్కార్‌ పట్టుబట్టినపుడు బీజేపీ గూండాలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంపై దారుణమైన రీతిలో దాడి కూడా జరిగింది. అణచివేత, బెదిరింపుల పాలన ద్వారా సీపీఐ(ఎం)ను, వామపక్ష సంఘటనను ఐదేండ్ల పాటు నిరంతరాయంగా నిర్వీర్యం చేసేందుకు, బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఎన్నికలలో తాము పేలవమైన విజయం పొంద డానికి ఇదొక ముఖ్యమైన కారణమని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమికి బాగా తెలుసు. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వచ్చిన వామపక్షాలు ఎన్నికల ప్రచారంలో ధైర్యంగా పనిచేశాయి. వామపక్షాలు, ప్రతిపక్షంపై ఇప్పటికీ బీజేపీ హింసాకాండ కొనసాగుతున్నదంటే అందుకు ఆ పార్టీలో నెలకొన్న భయాలు, అభద్రతా భావాలే కారణమని చెప్పవచ్చు. తమపై సాగుతున్న హింసాకాండ నుండి తప్పించుకోవడం, ప్రజలతో సంబంధాలను కొనసాగించడమనే బృహత్తర కర్తవ్యాన్ని సీపీఐ(ఎం), వామపక్ష సంఘటన చేపట్టాయి. ఈ ప్రయత్నంలో, వాటికి ప్రజాతంత్ర, ప్రగతిశీల, లౌకిక శక్తులన్నిటి మద్దతు, తోడ్పాటు కావాలి.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Spread the love