యూపీలో బీజేపీ మహిళా కార్యకర్తల ఫైటింగ్..

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా కార్యకర్తలు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, సదరు మహిళా కార్యకర్తలు ఎందుకు కొట్టుకున్నారు, గొడవకు కారణమేంటనే వివరాలు తెలియరాలేదు. నడివీధిలో మహిళలు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని జాలౌన్ జిల్లాలో బీజేపీ నారీశక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇంతలో ఏంజరిగిందో తెలియదు కానీ ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. కోపం పట్టలేక ఓ మహిళ మరో మహిళ జుట్టు పట్టుకుని కిందపడేసి కొట్టడం మొదలుపెట్టింది. దీంతో మిగతా మహిళలు బాధితురాలికి సహాయంగా వచ్చారు. దాడి చేస్తున్న మొదటి మహిళపై పిడిగుద్దులు కురిపించారు. నలుగురు మహిళలు చుట్టూ మూగి కొట్టారు. ఓ యువకుడు కూడా మహిళపై దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఇదంతా అక్కడే ఉన్న ఓ యువకుడు తన సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఘటనపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Spread the love