– పోలీసులే సామూహిక హింసాకాండకు కారకులు
– అవి జాతుల అల్లర్లు కాదు..రాజ్యహింస :
– ‘మణిపూర్ మారణకాండ- ఉమ్మడి పౌరస్మృతి’పై సభలో ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శులు మరియం ధావలె, అనీరాజా
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం
మణిపూర్ గాయం బీజేపీ ప్రభుత్వం చేసిందేనని, మణిపూర్‌లో రాజ్యహింస జరుగుతోందని ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శులు మరియం ధావలె, అనీరాజా అన్నారు. అందమైన పర్వత శ్రేణులున్న మణిపూర్ అల్లకల్లోలమవుతోందన్నారు. అక్కడి ప్రభుత్వం ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తోందన్నారు. సుందరమైన రాష్ట్రానికి అయిన గాయం మానడానికి అనేక సంవత్సరాలు పడుతుందని తెలిపారు.
ప్రత్యామ్నాయ పౌరసమూహం ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘మణిపూర్ మారణకాండ- ఉమ్మడి పౌరస్మృతి’పై సీసీఏ సభ్యులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మరియం ధావలె మాట్లాడారు. సామాజికంగా ఎంతో ఐక్యంగా ఉండే ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాత్రికి రాత్రే శతృత్వాన్ని పెంచిందన్నారు. ఇప్పటికీ కుకీలు, మైతీలు సఖ్యతతో ఉండేందుకు ముందుకొస్తున్నా పాలకులు మాత్రం వారిని ఏకంకాకుండా నిలువరిస్తున్న దుస్థితి ఉందన్నారు. అలీవియా అనే యువతిని, మైతీ తెగకు చెందిన వ్యక్తిని వివాహమాడిన కుకీ మహిళ జోషావాను అత్యంత దారుణంగా హతమార్చారని తెలిపారు.
రక్షించాల్సిన పోలీసులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన ఉదంతాలు మణిపూర్‌లో చోటు చేసుకున్నాయన్నారు. సోదరి మాన ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నించిన యువకున్ని, అతని తండ్రిని కూడా హతమార్చిన దురాఘతాలు మణిపూర్‌లో నెలకొన్నాయని తెలిపారు. దేశంలో ఉన్న మహిళలందరూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇటువంటి దుస్థితి మరో మహిళకు, మరే రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు తమను కోరినట్టు తెలిపారు. అందరూ తమ కోసం పోరాడాల్సిందిగా ఆకాంక్షించారన్నారు. కుటుంబ సభ్యులను హతమార్చిన వారిపైనా.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిపైనా కనీసం కేసులు కూడా నమోదు చేయలేదని వాపోయారు. ప్రజాపంపిణీ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. ఇంతలా హింస జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో రాజ్యహింస: అనీరాజా
మణిపూర్‌లో హింస.. జాతులు, తెగల మధ్య కాదని అది రాజ్యహింస అని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అనీరాజా అన్నారు. మణిపూర్‌ను చీల్చే కుట్రలో భాగంగానే హింస ప్రేరేపితమైందన్నారు. ఇంపాల్‌లో చర్చిలను సైతం ధ్వంసం చేశారని తెలిపారు. అమిత్‌షా పర్యటన తర్వాతే మణిపూర్‌లో రాజ్యహింస మొదలైందన్నారు. కుకీ, నాగ, మైతీలుగా మణిపూర్‌ను విభజించి పాలించాలని చూస్తున్నారన్నారు. కుకీ ప్రాంతాన్ని అస్సోం రైఫిల్స్‌కు అప్పగించారని, మైతేయి ప్రాంతాలను ఇతర వర్గాల కు అప్పగించారన్నారు. హిందుత్వ శక్తులు ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయన్నారు.
ప్రజాస్వామ్య మూలస్తంభాలను కూల్చివేయా లని ప్రయ త్నిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్‌కు చెందిన సామాజికవేత్త, అధ్యాపకులు కిమ్ కోవా సైతం ప్రసంగించారు. వీరి ఉపన్యాసాలను ఐద్వా ఖమ్మం జిల్లా కార్య దర్శివర్గ సభ్యులు, మున్సిపాల్టీ మాజీ చైర్మెన్ అఫ్రోజ్ సమీనా తెలుగులో అను వాదం చేశారు. సభలో ప్రత్యామ్నాయ పౌరసమూహం సభ్యులు ఐవీ రమణా రావు, మువ్వా శ్రీనివాసరావు, రవిమారుత్, డాక్టర్ భారవి, ఓరుగంటి శేషగిరి రావు, స్పర్శ భాస్కర్, దేవిరెడ్డి విజరు, బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.