భిన్న జీవన సంస్కృతుల మేళవింపు

షడ్రసోపేతమైన దాల్చాను ప్రతీకగా చేసుకుని ఆరు అందమైన కథలతో ముందుకు వచ్చారు డాక్టర్‌ కె.బి. సంధ్యావిప్లవ్‌. ఈమె కవిగా, సామాజిక ఉద్యమకర్తగా సుపరిచితులు. పుస్తకం పేరు కూడా దాల్చానే. సామాజిక పురోగతికి సరైన నిర్వచనం మహిళ. అన్ని కాలాల్లోనూ ప్రాధాన్యత లేని అసమాన పాత్ర మహిళలది. ప్రతిఫలం ఆశించకుండా ఏదైనా చేయగలిగే మహిళలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. అటువంటి వారిలో తమ శక్తికి మించి కృషి చేసేవారు అసాధారణ మహిళలుగా కనిపిస్తుంటారు. పుస్తకంలోని ఆరు కథల్లోనూ భిన్న వర్గాలకు చెందిన అసాధారణ మహిళలే కనిపించడం విశేషం.సామాజిక వివక్ష నాటి నుంచి నేటి తరం దాకా ఎలా కొనసాగుతూ వస్తుందో ఈ కథల్లో చూడవచ్చు. అలాగే అసమానతలు దాటి కులమతాలకు అతీతంగా వికసించే ప్రేమానుబంధాలకు ప్రతీకలు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ కథలు రచయిత్రి తొలి పుస్తకం అంటే నమ్మబుద్ధి కాదు. ప్రతిదశలోనూ ఒక కొత్త రకమైన మలుపు తీసుకుంటూ ఆసక్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా జీవన సంస్కృతిపై ఎక్కువగా దృష్టి పెట్టి పాత్రలను మలిచారు రచయిత్రి. కథల నిడివిని పట్టిపట్టి చూస్తున్న ఈ కాలంలో దానితో సంబంధం లేకుండా కాన్వాసుకు తగిన న్యాయం చేసారు. స్వతహాగా వైద్యురాలైనందునేమో కథలన్నీ చికిత్సల చుట్టూనే తిరుగుతుంటాయి. అయినప్పటికీ తాము సరైనదని నమ్మిన విషయాలకు కట్టుబడి జీవనం సాగించిన బలమైన పాత్రలు సోని, కమ్లమ్మ, చిట్టి, రెహానా, పెంటమ్మ తదితరులు. ఇక అన్ని బంధాలకు అతీతంగా సాగే ఓ నిర్మలమైన బంధం పద్మమ్మ-ఎడ్డి పుల్లమ్మది. ఏక్‌ అమ్మీ ఔర్‌ అజ్హర్‌, దాల్చ కథలు పాఠకులను తమతో పరుగులు పెట్టించి కన్నీరు తెప్పిస్తాయి. ఇటువంటి గొప్ప కథలు దృశ్యకావ్యాలు మలిచిన రచయిత్రికి అభినందనలు.
– నస్రీన్‌ ఖాన్‌
[email protected]

Spread the love