అంధత్వ రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యం

– మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
అంధత్వ రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని, కంటి వెలుగు ద్వారా ఎంతో మందికి కంటి సమస్యలు నయమయ్యాయని మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ అన్నారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో కంటి వెలుగు విధులు నిర్వహించిన సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ మాట్లాడుతూ అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కంటి సమస్యలతో బాధ పడుతున్న ఎంతోమంది సద్వినియోగం చేసుకోవడం జరిగిందని, కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేసిన వెంటనే అద్దాలు ఇవ్వడంతో పాటు ఆపరేషన్‌ అవసరమైన వారిని రెఫర్‌ చేయడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా సర్కార్‌ ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నటరాజ్‌, కమిషనర్‌ వెంకన్న, కౌన్సిలర్లు బచ్చలి నరసింహ, ఈగ వెంకట్రాంరెడ్డి, కంటి వెలుగు డాక్టర్లు జయప్రకాష్‌, శ్వేత, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, ఆప్తోమెట్రిస్ట్‌ ఇంద్రజ, ఎఎన్‌ఎమ్‌లు నవనీత, నిర్మల, శ్రీలత, ఆశలు మంజుల, త్రివేణి, లక్ష్మీ, గ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు యుగంధర్‌, మహ్మద్‌ ఎజాజ్‌, ప్రదీప్‌ కుమార్‌, మలగారి సత్యనారాయణ, అంతటి కోటిలింగం , పోకల శేఖర్‌ అప్ప, కత్తి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love