రక్తదాతలే ప్రాణదాతలు

Blood donors are life donorsమానవులు, ఇతర జంతువుల్లో కణజాలాలకు పోషకాలు, ఆక్సిజన్‌ సరఫరా చేసే ద్రవాన్నే ‘రక్తం’ అంటారు. అదే సమయంలో జీవక్రియలలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను తీసుకుని పోయేది. ‘హైమా’ అనే గ్రీకు పదం నుంచి ‘హీమో(రక్తం)’ అనే పదం ఉద్భవించింది. రక్తానికి సంబంధించిన అధ్యాయాన్ని ‘హెమటాలజీ’ గా పిలుస్తారు. రక్తం ఎర్రగా ఉండటానికి కారణం ‘రక్తచందూరం’ అనే ప్రోటీన్‌. దీనినే ‘హీమోగ్లోబిన్‌’ అంటారు. రక్తంలో ఎనభై శాతం (80%) నీరే ఉంటుంది. మనిషి శరీర బరువులో 7% రక్తం ఉంటుంది. 1901లో ఆస్ట్రియాకు చెందిన నోబెల్‌ విజేత ‘కార్ల్‌ లాండ్‌ స్టీనర్‌’ (ఫాదర్‌ ఆఫ్‌ ది బ్లడ్‌ గ్రూప్స్‌) మొదటి సారిగా ‘రక్త వర్గీకరణ’ చేయడం వల్ల ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని డబ్లు.హెచ్‌.ఓ (WHO) లో సభ్యత్వం ఉన్న సుమారు 192 దేశాలు రక్తదానం విలువను, ప్రాధాన్యత తెలుపుతూ 2005 నుంచి ప్రతీ సంవత్సరం జూన్‌ 14వ తేదీన ‘ప్రపంచ రక్తదాన దినోత్సవం’ జరుపుతున్నాయి. ఈ 2024 సంవత్సరంలో ’20 ఇయర్స్‌ ఆఫ్‌ సెలబ్రేటింగ్‌ గివింగ్‌, థ్యాంక్యూ బ్లడ్‌ డోనార్స్‌’ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు.
ముఖ్యంగా రక్తంలో ప్లాస్మా, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు అనే మూడు అంశాలు మిళితమై ఉంటాయి. ప్లాస్మా 54.3% రక్తం గడ్డకట్టుటకు, తెల్ల రక్తకణాలు 0.7% వ్యాధుల నుంచి రక్షించేందుకు, ఎర్ర రక్త కణాలు 45% ఆక్సిజన్‌ సరఫరా చేయుటకు సహకరిస్తూ, మనల్ని ఆరోగ్యంగా, సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ, హార్మోన్ల సరఫరాకు వాహకంగా పనిచేస్తుంది. దెబ్బతిన్న కణజాలాన్ని నయం చేస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు రక్తంగడ్డ కట్టేలా చేస్తుంది. కార్బన్‌డైఆక్సైడ్‌, లాక్టిక్‌ ఆమ్లం వంటి వ్యర్ధాలను నిర్మూలిస్తుంది. గ్లూకోజ్‌, ఎమినో ఆమ్లాలు, ఫాటీ ఆసిడ్స్‌ సరఫరా చేస్తుంది.
వివిధ సందర్భాల్లో, అంటే… గర్భిణీ స్త్రీలకు, ఆపరేషన్‌ సమయంలో, తలసేమియా రోగులకు, రక్తహీనతో బాధపడేవారికి, ప్రమాదాలకు గురైనప్పుడు, వివిధ అనారోగ్యాలకు గురైనప్పుడు రక్తం అవసరమవుతుంది. అటువంటి సమయంలో రక్తం విలువ ప్రాణంతో సమానం. కావున ఆరోగ్యవంతమైన 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న వారు రక్తం దానం చేసి, అనేక లక్షల మంది ప్రాణాలను కాపాడాలని అవగాహన కల్పించి, చైతన్య పరుచుటయే ఈ రక్తదాన దినోత్సవ పరమార్థం.
రక్తం ఇచ్చేవారిని ‘దాతలు’అని, రక్తం తీసుకునే వారిని ‘గ్రహీతలు’ అని అంటారు. ముఖ్యంగా రక్తంలో ఏ, బి, ఏబి, ఓ అను నాలుగు గ్రూపులు ఉంటాయి. ‘ఓ’ గ్రూప్‌ వారిని విశ్వదాత అని, ‘ఏబి’ గ్రూప్‌ వారిని విశ్వగ్రహీతలు అని అంటారు.
ఆర్‌.హెచ్‌ ఫ్యాక్టర్‌ కూడా ఉంటుంది అని ‘లాండ్‌ స్టీనర్‌’ తెలిపారు. రక్తదానం చేసే వారు, యాభై కేజీలు తక్కువ కాకుండా బరువు కలిగి, అంటువ్యాధులు, హెపటైటిస్‌, ల్యుకేమియా, హెచ్‌.ఐ.వి వంటి వ్యాధులు ఉండరాదు. రక్తదానం చేయడం వల్ల ఏరకమైన అనారోగ్యాలు రావు అని, ఏమైనా అపోహలు ఉంటే తొలగించి రక్తదాతలను ప్రోత్సహించి, అనేకమంది ప్రాణాలు నిలబెట్టాలి. ఆరోగ్యవంతమైన వారు సంవత్సరానికి 3 సార్లు రక్తదానం చేయవచ్చు.. ఒక వ్యక్తి 18 సంవత్సరాల దాటిన నుండి తన జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు.
‘సెలబ్రేటింగ్‌ ది గిఫ్ట్‌ ఆఫ్‌ బ్లడ్‌’ అనే స్లోగన్‌ ముందుకు తీసుకుని వెళ్ళాలి. రక్తంలోని మూడు అంశాలు… ప్లాస్మా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఎర్ర రక్త కణాలు నలభై రెండు రోజులు, ప్లేట్‌టెట్స్‌ ఐదు రోజుల వరకు నిల్వ ఉండి, మూడు రకాల అవసరాలు ఉన్నవారికి, అనారోగ్యాలవారికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 60 దేశాలు మాత్రమే రక్త నిల్వలు ఉంచుకోగలుగుతున్నాయి. 70 దేశాల్లో రక్తం అవసరం ఉన్న వారికి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు దానం చేస్తున్నారు అని నివేదికలు చెబుతున్నాయి.
ప్రతీ దేశంలో వారి అవసరాల మేరకు రక్తం నిలువ ఉండాలంటే రక్తదాతల సంఖ్య పెరగాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. స్వచ్ఛంద సంస్థలు, మీడియా చైతన్య పరచాలి. రెడ్‌ క్రాస్‌ సంస్థల వలే పలు సంస్థలు ముందుకు రావాలి. అదే సందర్భంలో రక్తం నిల్వ ఉంచే సౌకర్యాలు పెంపొందించుకోవాలి. ఉచితంగా దానం ఇచ్చే వారని గౌరవించాలి. ప్రశంసించాలి. ఇతరులను మోటివేషన్‌ చేసే విధంగా అవకాశం కల్పించాలి. ‘రక్తదానం -ప్రాణదానం’. ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడంలో ఆరోగ్యవంతులుగా ఉన్నవారు అందరూ ‘రక్తదాతలే – ప్రాణదాతలు’గా మారాలి.

– ఐ.ప్రసాదరావు 6305682733

Spread the love