నవతెలంగాణ ఢిల్లీ: పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో పీఎం శ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బోర్డు పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానంలో (NEP-2020) విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం ఒకటని, ఈ క్రమంలో విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘‘2025-26 అకడమిక్ సెషన్ నుంచి పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసే వీలు కల్పించనున్నాం. ఇందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడికి దూరం చేసిన నాణ్యమైన విద్యను అందించడమే మా సర్కారు లక్ష్యం. ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంది’’ అని వెల్లడించారు.
స్పష్టత లేదు
పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ గతేడాది ఆగస్టులో కొత్త కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం.. టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబరిచేందుకు వీలుంటుందని విద్యాశాఖ పేర్కొంది. అయితే, ఈ పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న విషయంలో అస్పష్టత నెలకొంది. సెమిస్టర్ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్‌పై రెండు సార్లు నిర్వహిస్తారా? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇక, కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను కచ్చితంగా అభ్యసించాలని.. వీటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని నిర్ణయించారు.