ప్రమాదంలో బోట్‌మెన్‌ల జీవనోపాధి

– వారణాసిలో గంగా నదిపై వాటర్‌ టాక్సీ సర్వీస్‌కు ప్రతిపాదన
– గుజరాత్‌ నుంచి నగరానికి చేరిన వాటర్‌ ట్యాక్సీలు
– ఆందోళన వ్యక్తం చేస్తున్న బోట్‌మెన్‌లు
– ఇప్పటికే వారం పాటు నిరసన చేసిన బోట్‌మెన్‌లు
– ప్రధాని మోడీ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం
లక్నో: ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో పడవ నడుపుకొని జీవనం సాగించే వారు (బోట్‌మెన్‌లు) ఆందోళనలో ఉన్నారు. వారి జీవనోపాధి ప్రమాదంలో ఉన్నది. కారణం.. వారణాసి మునిసిపల్‌ కార్పొరేషన్‌ తీసుకున్న నిర్ణయం. వారణాసిలో ఉండే గంగా నదిలో ఇప్పటి వరకు పడవ నడిపేవారు యాత్రికులు, పర్యా టకులను తమ పడవల్లో తీసుకెళ్తూ జీవనం సాగించేవారు. అయితే, వారణాసి యంత్రాంగం మాత్రం వారి ఉపాధికి గండి కొట్టే చ్యలకు దిగింది. గంగా నదిలో వాటర్‌ ట్యాక్సీలను నడపాలని నిర్ణయించింది. ఇక్కడి బోట్‌మెన్‌లను ఆందోళనకు గురి చేస్తున్నది. వారణాసి మునిసిపల్‌ కార్పొరేషన్‌ తీరును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ జీవనోపాధికి ఆటంకం కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ”నేను ఇక్కడ 42 ఏండ్లుగా పని చేస్తున్నాను. మొదటగా.. కోవిడ్‌ సమయంలో మా ఉపాధి దెబ్బతిన్నది. మేము ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు గుజరాత్‌ నుంచి వాటర్‌ ట్యాక్సీలను ప్రవేశపెట్టటం ద్వారా ఉన్నవారి జీవనోపాధిని తొలగించాలని వారణాసి యంత్రాంగం చూస్తున్నది” అని సుజీత్‌ నిషాద్‌ (56) అనే బోట్‌మెన్‌ వెల్లడించారు. తాను 14 ఏండ్ల నుంచి ఈ వృత్తిలో ఉన్నానని చెప్పారు. వాటర్‌ ట్యాక్సీల వల్ల నిషాద్‌ లాంటి వారు ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు.
పదివేల కుటుంబాలపై ప్రభావం
వారణాసిలో అనేక దశాబ్దాలుగా గంగా నదిపై పర్యాటకులు, యాత్రికులను తీసుకువెళుతున్న 1,500 దేశీయ పడవలు ఇప్పటి వరకు 84 ఘాట్‌లకు సేవలు అందిస్తున్నాయి. గత వారం వాటర్‌ ట్యాక్సీ ప్రయాణీకులను ఆకర్షించిన తర్వాత దాదాపు పదివేల సంప్రదాయ బోట్‌మెన్‌ కుటుంబాలపై అనిశ్చితి నెలకొన్నది.
మాకు సమాచారం అందించలేదు
నీటి ట్యాక్సీలు నడిపేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకునే ముందు తమకు సమాచారం అందించలేదని ‘మా గంగా నిషాదరాజ్‌ సేవా న్యాస్‌’ అధ్యక్షుడు ప్రమోద్‌ మాంఝీ ఆరోపించారు. ”వాటర్‌ టాక్సీలు ఘాట్‌ల వద్ద తిరుగుతుంటే, అవి మా ఏకైక ఆదాయ వనరు అయిన వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, వాటర్‌ ట్యాక్సీలను నడపకూడదు” అని మాంఝీ అన్నారు. బోట్‌మెన్‌ల సమస్యలను లేవనెత్తుతూ ‘మా గంగా నిషాద్‌రాజ్‌ సేవా న్యాస్‌’ యూనియన్‌ బ్యానర్‌లో వందలాది మంది స్థానిక బోట్‌మెన్‌లు గంగా నదిపై ప్రతిపాదిత వాటర్‌ ట్యాక్సీ సర్వీసుకు నిరసనగా వారం రోజుల పాటు సమ్మె చేశారు. వారు బోట్ల నిర్వహణను నిలిపివేశారు. యాత్రికులు, పర్యాటకులు పడవ ప్రయాణాల పట్ల ఆసక్తి చూపటం లేదు. ఇది భారీ నష్టానికి దారితీసింది.
‘మళ్లీ సమ్మెకు దిగుతాం’
వాటర్‌ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించవద్దని తాము అనేకసార్లు కోరినప్పటికీ జిల్లా యంత్రాంగం, మున్సిపల్‌ అధికారులు తమ గోడును పట్టించుకోలేదని సంఘం ఆరోపించింది. ”ఒక మార్గాన్ని కనుగొంటామని అధికారులు మాకు హామీ ఇవ్వడంతో మేము మా సమ్మెను విరమించుకున్నాం. కానీ మా డిమాండ్‌ నెరవేరే వరకు మేం త్వరలో మరో సమ్మెను ప్రారంభిస్తాం” అని మా గంగా నిషాద్‌రాజ్‌ సేవా న్యాస్‌ అధ్యక్షుడు మాంఝీ అన్నారు. వారణాసిలో సుమారు 10 వేల మంది బోట్‌మెన్‌లు పడవ కార్యకలాపాలలో నిమగమై ఉన్నారనీ, ఇక్కడ 1500 పడవలు పనిచేస్తున్నాయని చెప్పారు. నిషాద్‌ కమ్యూనిటీకి చెందిన దాదాపు 50,000 మంది సభ్యులు కేవలం బోటింగ్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారనీ, గంగా నదిపై వాటర్‌ ట్యాక్సీలను నడపడం వల్ల వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాంఝీ మాట్లాడుతూ.. ”మునిసిపల్‌ కార్పొరేషన్‌ యొక్క క్రూయిజ్‌ సర్వీస్‌ రూ. 1,500 వసూలు చేస్తున్నది. అయితే బోట్‌ మెన్‌ కమ్యూనిటీ అదే రకమైన రైడ్‌ కోసం రూ. 400 మాత్రమే తీసుకుంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటర్‌ ట్యాక్సీల రాకపోకలను సంఘం అనుమతించబోదు” అని చెప్పారు.
మోడీ మా ప్రయోజనాలను విస్మరించారు
వారణాసికి చెందిన నిషాద్‌-కశ్యప్‌ కమ్యూనిటీకి చెందిన బోట్‌మెన్‌లు, ప్రధాని మోడీ నిర్లక్ష్య వైఖరితో సంతోషంగా లేరు. పాలనా యంత్రాంగం తమను మోసం చేసిందని వారు భావిస్తున్నారు. ”2014లో వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అత్యంత నిర్లక్ష్యానికి గురైన సమాజం తమ పరిస్థితి మెరుగుపడుతుందని భావించి మోడీ హదయపూర్వకంగా మద్దతు పలికారు. అయితే అప్పటి నుంచి తమ ప్రయోజనాలను విస్మరించారు” అని వారు అంటున్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ నుంచి వాటర్‌ ట్యాక్సీలుగా వినియోగించుకునేందుకు కనీసం పది మోటార్‌బోట్లు ఇటీవల వారణాసికి వచ్చాయి. అన్నీ అను కున్నట్టు జరిగితే జూలై 15 నాటికి ట్యాక్సీలు అందు బాటులోకి రానున్నాయి.
ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు
మరోవైపు, బీజేపీ పేద ప్రజల నుంచి వ్యాపారాన్ని లాగేస్తున్నదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. బోట్‌మెన్‌లకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. వారి నిరసనను సమర్థిస్తూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు.
ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌

Spread the love