– దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ – కల్లూరు
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం నుండి రాళ్ల బంజర వెళ్లే రహదారిలో ఆర్అండ్ బీ రహదారి పక్కన గల పుల్లప్పకుంట చెరువులో మహిళ శవం గుర్తు పట్టని రీతిలో లభ్యమైంది. మంగళవారం పుల్లపుకుంట చెరువులో మత్స్యకారులు చేపలు పెంపకానికి మేత వేస్తుండగా శవం కనిపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ ఎస్.కె షాకీర్ సిబ్బంది వెళ్లి శవం ఉన్న గోనసంచిని బయటి తీసి చూశాడు. శవం మొత్తం కుళ్ళిపోయి, గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. దీంతో ఎస్ఐ ఎస్కే షాకీర్, కల్లూరు ఏసీపీకి అనిశెట్టి రఘుకి, పెనుబల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్యకి, తహసీల్దార్ కి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ అనిశెట్టి రఘు మాట్లాడుతూ.. మృతదేహాన్ని పరిశీలిస్తే కుళ్ళిపోయిన శరీరం ఉండటంతో వారం పది రోజుల క్రితమే చెరువులో పడి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఇది ఎలా జరిగిందని, హత్య.. లేక ఆత్మహత్యనా.. అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ పులి సాంబశివుడు సమక్షంలో పంచనామా నిర్వహించి, శవపరీక్షకు పెనుబల్ ఆస్పత్రికి తరలించారు.