బాడీబిల్డర్‌ ఇలియా యెఫిమ్చిక్‌ మృతి

Bodybuilder Ilya Yefimchik passed away– గుండెపోటుతో మరణించిన బెలారస్‌ బీస్ట్‌
మిన్స్‌ సిటీ (బెలారస్‌): అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘బెలారస్‌ బీస్ట్‌’, ‘ది మ్యూటంట్‌’ బాహుబలి బాడీబిల్డర్‌ ఇలియా యెఫిమ్చిక్‌ అకస్మికంగా మరణించారు. ప్రతి రోజు ఏడు సార్లు భోజనం చేసే ఇలియా.. ఒక్క రోజులోనే 16500 కేలరీల ఆహారం తీసుకునేవారు. ఇలియా డైట్‌లో జపాన్‌ ప్రత్యేక వంటకం సుషి, 2.5 కేజీల మాంసం సాధారణం. ఆరడుగుల ఎత్తు, 61 అంగుళాల ఛాతి, 25 అంగుళాల బైసెప్స్‌తో బీస్ట్‌ను తలపించే దేహధారుడ్యం ఇలియా సొంతం. ప్రొఫెషనల్‌గా ఎటువంటి క్రీడా పోటీల్లో ఇలియా పోటీపడలేదు. కానీ విలక్షణ బాడీబిల్డర్‌గా ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో విశేష అభిమానులను సంపాదించుకున్నాడు. 600 పౌండ్ల బెంచ్‌ ప్రెస్‌, 700 పౌండ్ల డెడ్‌లిఫ్ట్‌లతో రోజు జిమ్‌ విడియోలు చేసే ఇలియా సోషల్‌ మీడియాలో బాడీబిల్డింగ్‌పై ఆసక్తి చూపించే యువతకు స్ఫూర్తిగా నిలిచారు. టీనేజర్‌గా బాడీబిల్డింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఇలియా 70 కేజీల బరువు నుంచి 160 కేజీల బరువుకు పెరిగాడు. కఠోర ట్రైనింగ్‌, క్రమశిక్షణ, ఫిజియా లజీ, న్యూట్రిషన్‌పై చక్కటి అవగాహనతో ఇలియా ప్రపంచం లోనే మేటి బాడీబిల్డర్‌గా ఎదిగాడు. 36 ఏండ్ల వయసులోనే ఇలియా గుండెపోటుతో మరణించటం బాడిబిల్డింగ్‌ యువతను షాక్‌కు గురి చేసింది.
‘నా శరీర రూపాంతరం కొన్నేండ్ల పాటు కఠిన సాధన, క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్‌ ఫలితం. ఫిజియాలజీ, న్యూట్రి షన్‌పై మంచి అవగాహన కలిసొచ్చింది. యువతలో వర్క్‌ ఎథిక్స్‌ను నింపటంతో పాటు తమను తాము మార్చుకునే ప్రక్రియలో, ఏదైనా సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో చవిచూసే భయాలను అధిగమించేలా చేయటమే నా బాడీబిల్డింగ్‌ మిషన్‌ లక్ష్యం’ అని ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియా పేర్కొన్నాడు. సెప్టెంబర్‌ 6న ఇంట్లో ఉండగా ఇలియా గుండెపోటుతో ఇబ్బంది పడగా.. అతడి భార్య అనా సీపీఆర్‌ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత గుండె స్పందించినా ఇలియా బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారని వైద్యులు ధృవీకరించారు. సెప్టెంబర్‌ 11న ఇలియా ఆకస్మిక మరణం చెందారని రష్యా పత్రికలు తెలిపాయి.

Spread the love