బోయినపల్లి వినోద్‌ కుమార్‌ రాజీనామా

– అదే బాటలో పలు కార్పొరేషన్ల చైర్మెన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయి…కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకూ నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్నవారు, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ పదవికి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సోమవారం ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా పంపారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని క్రీడలు యువజన పర్యాటక అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి అందజేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ వైస్‌ చైర్మెన్‌ పదవికి వనం జ్వాల నరసింహరావు రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌, తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మెన్‌ ఆయాచితం శ్రీధర్‌, రాష్ట్ర డెయిరీ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ సోమ భరత్‌ కుమార్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరి గౌరీ శంకర్‌, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవి కుమార్‌ గౌడ్‌, టీఎస్‌ ఫుడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గూడూరు ప్రవీణ్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గజ్జెల నగేష్‌, ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అనిల్‌ కూర్మాచలం, ట్రైకార్‌ చైర్మెన్‌ రామచంద్ర నాయక్‌, గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మెన్‌ వలియా నాయక్‌, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, పౌర సరఫరాల సంస్థ చైర్మెన్‌ రవీందర్‌ సింగ్‌, రాష్ట్ర టెక్నాలజీస్‌ సర్వీసెస్‌ చైర్మెన్‌ జగన్మోహన్‌ రావు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఇన్నాళ్లూ ప్రజలకు సేవ చేసేందుకు తమకు అవకాశమిచ్చినందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్‌ జెన్కో, ట్రాన్స్‌ కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
ఇంటెలిజెన్స్‌ ఓఎస్డీ రాజీనామా  అదే దారిలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ
రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఐజీ, ఓఎస్డీ ప్రభాకర్‌రావుతో పాటు హైదరాబాద్‌ నగర టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావులు రాజీనామా చేశారు. ఈ ఇద్దరు అధికారులు మూడేండ్ల క్రితమే రిటైర్‌ కాగా.. ప్రభుత్వం వారి సర్వీసులను పొడిగించింది. ముఖ్యంగా, ప్రభాకర్‌రావు ఇంటెలిజెన్స్‌ ఐజీగా మంచి పేరు తెచ్చుకోగా, ఆయన తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాడంటూ గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పలుమార్లు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పడిపోవటంతో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఇద్దరూ రాజీనామా చేశారు.
కాగా, అదే దారిలో సీఎంకు శాంతి భద్రతల విభాగం సలహాదారుగా ఉన్న మాజీ డీజీపీ అనురాగ్‌శర్మ, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ విభాగం సలహాదారుడిగా మరో మాజీ డీజీపీ ఎ.కె. ఖాన్‌లు కూడా రాజీనామాలు సమర్పిస్తున్నట్టు తెలిసింది.

Spread the love