కోల్‌కతాలో పేలుడు..వ్యక్తి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో పేలుడు సంభవించింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించే వ్యక్తి మరణించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నది. ఆ ప్రాంతమంతా తనిఖీ చేసింది. శనివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో సెంట్రల్ కోల్‌కతాలోని బ్లాచ్‌మన్ స్ట్రీట్, ఎస్‌ఎన్ బెనర్జీ రోడ్ కూడలిలో పేలుడు జరిగింది. చెత్త ఏరుకునే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడ్ని 58 ఏళ్ల బాపి దాస్‌గా గుర్తించారు. కాగా, పేలుడు సంభవించిన బ్లాచ్‌మన్ స్ట్రీట్ ప్రవేశం వద్ద ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌ను కొందరు వ్యక్తులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌, ఫోరెన్సిక్ టీమ్‌ను అక్కడకు రప్పించారు. అనుమానాస్పద బ్యాగ్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Spread the love