నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో బాంబు బెదిరింపులు సర్వసాధారణమైపోయాయి. ఇటీవలే కాలంలో పాఠశాలలు, విమానాశ్రయాలు, హోటల్స్‌కు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు కళాశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. సదాశివనగర్‌లో ఉన్న BMSCE, హనుమంత నగర్‌లో ఉన్న MSRIT, బసవనగుడిలో ఉన్న BIT కళాశాలకు శుక్రవారం బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మూడు కళాశాలలకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన ఆయా కళాశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో ఆయా కళాశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.