మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తమిళనాడులోని రెండు పాఠశాలలకు, నిన్న ముంబైలోని ఓ పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌ రాష్ట్రంలోని మూడు పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి.  వడోదరలోని నవరచన స్కూల్‌ సహా మొత్తం మూడు పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఈ బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈమెయిల్‌ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని వెంటనే బయటకు పంపించారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాల సాయంతో ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వడోదర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Spread the love