నవతెలంగాణ – హైదరాబాద్
గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం బోనాలు గురువారం ప్రారంభమయ్యాయి. బోనాలలో పోతురాజులు, భాజా భజంత్రీలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల తొలి రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం వరకు కొనసాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు, ప్రధానార్చకుల ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ పండుగల్లో ఒకటైన బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. 2014 నుంచి 2022 వరకు బోనాల నిర్వణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.78.15 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులను ప్రతీ సంవత్సరం 3,033 ఆలయాలకు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. బోనాల పండుగకు ముందు తొలకరి పలకరింపు శుభసూచకంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అకాంక్షించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15కోట్లను కేటాయించిందన్నారు. దేవాయదాశాఖ పరిధిలోని ఆలయాలతో పాటు పరిధిలోని లేని ఆలయాలకు సైతం ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు.