– కాంట్రాక్టు కార్మికులకు చెల్లింపుపై విధివిధానాలు
– దానితోపాటే పండుగ అడ్వాన్స్ రూ.25వేలు
– అధికారులకు సీఎమ్‌డీ ఎన్ బలరాం ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించిన 33 శాతం లాభాల వాటా బోనస్‌ను అక్టోబర్ 9వ తేదీ చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ బలరాం అధికారుల్ని ఆదేశించారు. మంగళవారంనాడాయన అమెరికా నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాలు, కార్పొరేట్ కార్యాలయం జనరల్ మేనేజర్లు దీనిలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అమెరికా, జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాల్లో రూ.796 కోట్లను (33 శాతం) లాభాలవాటా బోనస్‌గా ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తాము పనిచేసిన పని దినాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని లాభాల వాటా బోనస్ చెల్లిస్తారు. సగటున ఒక్కొక్కరు దాదాపు రూ. లక్షా తొంభై వేలు చొప్పున లాభాల వాటా బోనస్‌ను పొందే అవకాశం ఉంది. అయితే సంస్థలో పనిచేస్తున్న దాదాపు 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా తొలిసారిగా ఈ బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు చేయాలని ఈ సందర్భంగా సీఎమ్‌డీ అధికారుల్ని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరంలో వివిధ కాంట్రాక్టర్ల వద్ద పనిచేసిన వారి వివరాలు, పూర్తిగా సేకరించి, దసరా పండుగకు ముందే వారికి కూడా బోనస్ చెల్లింపు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల జీతంతోనే పండుగ అడ్వాన్సుగా ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున చెల్లించాలని చెప్పారు. దీనికోసం సంస్థ రూ.95 కోట్లను కేటాయించిందన్నారు. సెప్టెంబరు నెల జీతాలతోపాటే పండుగ అడ్వాన్స్ సొమ్మును కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.