పుస్తక మహోత్సవం

manaviమంచి పుస్తకం వేలాది మంది స్నేహితులతో సమానం అంటారు. అందుకే పుస్తకం ఎంతో మంది కలలకు ఆధారం. ఒంటరితనంలో తోడు. పుస్తకం చదవడం వల్ల ఎన్నో గొప్ప  విషయాలు నేర్చుకోవచ్చు. పుస్తకాన్ని చదవడం వల్ల జ్ఞానాన్ని పొందడమే కాదు, మానసిక ఒత్తిడి సైతం తగ్గుతుంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ  వికాసానికి దోహదపడతాయి. పుస్తక పఠనం ద్వారా ఎంతో మంది ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అందుకే విజ్ఞానాన్ని అందించే భాండాగారం పుస్తకం. సమానత్వ  సాధనకై ఏండ్లుగా పోరాడుతున్న మహిళా లోకానికి ఓ ఆయుధం పుస్తకం. ఇటువంటి గొప్ప పుస్తకాలన్నీ ఓ చోటకు చేరి హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ రూపంలో మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ సందర్భంగా పుస్తకం, పుస్తక ప్రదదర్శనలపై రచయిత్రుల మనోగతలు ఏమిటో తెలుసుకుందాం…
పాఠకులకు, రచయితలకు వారధి
బుక్‌ ఫెయిర్‌ వస్తుందంటేనే మనసు ఉప్పొంగిపోతుంది. ఒకే అభిరుచి గల వారంతా ఒకేచోట గుమిగూడటమే పెద్ద ఆకర్షణగా ఉంటుంది. రచయితలు, పాఠకులు, బుక్‌ స్టాల్‌ నిర్వాహకులు… ఆ సందడి చెప్పనలవి కానిది. దీనికి తోడు ప్రతిరోజూ ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సందర్శకుల అభిరుచికి మరింత ఉత్సాహాన్ని అందిస్తారు నిర్వాహకులు. నచ్చిన పుస్తకం కొనుగోలు చేయాలంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎన్నో షాపులను సందర్శించాల్సి ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా ఒకే ప్రాంగణం లో మనకు తెలిసిన, తెలియని పుస్తకాలు అందుబాటులో ఉంచటం గొప్ప విషయం. పుస్తక ప్రియులకు ఇంతకన్నా సంతోషదాయకమైన మరో అంశం ఏముంటుంది? ఒక దశలో పాఠకులు తగ్గిపోయారని నిరాశ చెందారు పరిశీలకులు. కొన్నేళ్ళుగా పాఠకుల సంఖ్యను పెంచడంలో బుక్‌ ఫెయిర్‌ విజయవంతమైన పాత్ర పోషించిం దనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో అంచనాలకు మించి సందర్శకులు వస్తున్నారు. పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆశాజనక పరిణామం. పుస్తకం పది కాలాలపాటు వర్థిల్లాలి.
పోయినేడాది ఏర్పాట్లలో కొన్ని లోటుపాట్లు జరిగాయి. ఈసారి సాహితీ, చర్చా కార్యక్రమాలలో మహిళలకూ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. పరిశుభ్రతను పాటించని వారికి ఫుడ్‌ స్టాల్స్‌ ఇవ్వకూడదు. ప్రతి కొద్ది దూరానికి తాగునీటిని అందుబాటులో ఉంచాలి. టారు లెట్స్‌ సంఖ్యను పెంచడంతోపాటు ఆ విశాల ప్రాంగణంలో రెండు వైపులా విభజించి ఏర్పాటు చేయాలి. అంతేకాదు. కొనుగోలు చేసిన పుస్తకాలు మోసుకొని వెళ్ళడం పెద్ద టాస్క్‌లా ఉంది. అందుకోసం చిన్న ట్రాలీలు ఏర్పాటు చేస్తే సందర్శకులు ఆ బాధ నుంచి విముక్తులవుతారు. ఈ సూచనలను బుక్‌ ఫెయిర్‌ నిర్వాహకులు దృష్టిపెడతారని ఆశిస్తున్నాను.
– నస్రీన్‌ ఖాన్‌
పుస్తకాల బతుకమ్మ
క్షరము కాని అక్షరము మనకు ఎన్నో విషయా లను నేర్పిస్తుంది. అక్షర జ్ఞానం వల్ల వివేచన కలిగి సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఏ విషయం గురించి అయినా సమర్థవంతంగా ఆలోచించగలిగే నైపుణ్యం ఒక మంచి పుస్తకం ద్వారా కలుగుతుంది. అలాంటి అద్భుతమైన పుస్తకాల పండుగ వచ్చేసింది. 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ మొదలైంది. దాదాపు 320 స్టాళ్లతో 210 మందికి పైగా ప్రచురణకర్తల, పంపిణీదారులతో అనేక రకాల సాంస్కతిక కార్యక్ర మాలతో, సాహితి చర్చలతో అలరారబోతోంది.
‘లోకో భిన్న రుచిః’ అన్న నానుడికి అనుగుణంగా సాహిత్యం, కథ, కవిత, విమర్శ, పరిశోధనా గ్రంథాలు, విప్లవం, చరిత్ర, ఆధ్యాత్మికం, ఆటలు, కళలు, సంస్కతి, బాల సాహిత్యం ఇలా ఒక టేమిటి అడిగినవారికి అడిగినవి అందిస్తూ విభిన్న పుస్తక సము దాయాలతో దర్శనమిస్తోంది. ఇష్టమైన పుస్తకాలను, అలభ్య మవుతున్న పుస్తకాలను ఇక్కడ మనం పొందవచ్చు. పుస్తక ప్రియులకు, కవులకు, రచయితలకు, కళాకారులకు ఇది ఒక అక్షర విందు. ఇక్కడ మనం ముందు తరాల వారి రచనలతో పాటు యువ రచయితల పుస్తకాలను చూడవచ్చు. సమాజం పట్ల నేటితరం భావాలను అర్థం చేసుకోవచ్చు. మన అభిమాన రచయితలను కలవచ్చు. ప్రతి సంవత్సరం ఎన్నో వేల కొత్త పుస్తకాలు పుట్టుకొచ్చే ఈ ప్రాంగణంలో కిలకిలలాడే అక్షరాల ఆహ్వానంతో పాటు, కళకళలాడే సంతోషాల పలకరింపులు షరా మామూలే!
పుస్తకాలు చదవడం వల్ల మానసిక పరివర్తన కలుగుతుంది. అవి మనలోని ఊహాశక్తిని మేలుకొలుపుతాయి. మనో నేత్రానికి వెలుగునిస్తాయి. ప్రశ్నించటం, తిరగబడటం, సంఘటితం కావడం వంటి వాటితో పాటు మానవీయ విలువలను మనలో పెంపొందిస్తాయి. పుస్తకం ఒక నమ్మకమైన మిత్రుడు. పుస్తక పఠనం వల్ల తనను తాను అద్దంలో చూసుకున్నట్లుగా మనలోని మనిషిని మనం దర్శించగలుగుతాం.
డిజిటల్‌ కల్చర్‌ వల్ల తమలోని శక్తి యుక్తుల్ని తెలుసుకోలేకపోతున్న నేటి యువతరానికి పుస్తకాలు మార్గదర్శనమవుతాయి. ఈ పుస్తకోత్సవానికి తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా తీసుకు వెళ్ళటం చాలా అవసరం. తాము పుస్తకాలు కొనడంతో పాటు పిల్లలకు నచ్చిన పుస్తకాలు కొని యివ్వాలి. పుస్తకాల గురించి ఆసక్తి చూపుతున్న వారిని చూసి పిల్లలు కూడా స్ఫూర్తిని పొందుతారు. పుస్తక పఠనం వారికి ఉన్నత జీవన విధానాన్ని, సరికొత్త దిశను అందిస్తుంది. మనిషిని మనిషిగా మార్చగలిగేది పుస్తకం. మరి అలాంటి విలువైన పుస్తకాలను కొని మీరు చదవటంతో పాటు పెళ్లిళ్లలో, ఇతర ఫంక్షన్లలో బంధువులకు.. సభలు, సమావేశాలలో పుస్తక ప్రియులకు కానుకగా ఇస్తే ఎంతో బాగుంటుంది కదా! మరెందుకు ఆలస్యం. పుస్తకాల జాతరకు వచ్చి ఆనందంగా నచ్చిన పుస్తకాలు తీసుకు వెళ్ళండి. పుస్తకం మాత్రమే మనిషికి మనిషికి మధ్య నిజమైన కరచాలనం.
– విశ్వైక
కుటుంబ ఉత్సవం
అక్షర జ్ఞానం కలిగిన వారిలో పుస్తకాన్ని ఇష్టపడని వారు చాలా అరుదు. ఇండిస్టియల్‌ ఎగ్జిబిషన్‌ కోసం లక్షలమంది ఎదురుచూస్తూ ఉన్నట్టే ఈ పుస్తక ప్రదర్శనల కోసం ఎందరో పాఠకులు, కవులు, రచయితలు, పబ్లిషర్స్‌, విద్యార్థులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతమంది ఒకే చోట కలవగలిగే చోటు కూడా ఈ పుస్తక ప్రదర్శన మాత్రమే.. ‘ఇప్పుడు పుస్తకాలను ఎవరు చదువుతున్నారు’ అనే అపవాదును అధిగమిస్తూ ఈ పుస్తక ప్రదర్శనలు అద్భుతంగా నడపవచ్చును. ఈ మధ్యకాలంలో యువకవులు, విద్యార్థులు రచనా వ్యాసాంగంలోకి దూసుకొస్తున్నారు. అందుకు వారిని అభినందించాల్సిందే.. అయితే సాంద్రత లేని రచనలను మొహమాటానికి మెచ్చుకొని వారిని తప్పు దోవ పట్టించకుండా ఉండవలసిన బాధ్యత విజ్ఞులది. ఆ అవకాశం ఈ పుస్తక ప్రదర్శనలో కలగించాలి. వంద కంటే ఎక్కువ పుస్తకాలను ఈ బుక్‌ ఫెయిర్‌లో ఆవిష్కరించ బోతున్నారు. అందుకు నిర్వాహకులు అందరికీ అవకాశం కల్పిస్తూ.. ముఖ్యంగా మహిళలకు, బాలలకు ప్రత్యేక వసతులు కలిగిస్తూ అందరినీ ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను. పుస్తకం ఒక చెట్టు వంటిది, చెట్టు అమ్మ వంటిది. పుస్తకాల్లో ఉండేవి కూడా మన జీవితాలే. భాష ఏదైనా ఈ ప్రపంచంలో మన జీవితాలకు అద్దం పట్టేది పుస్తకాలు మాత్రమే. అందుకోసమే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి. పుస్తకాలను రాసి అచ్చు వేసే వాళ్ళకి అమ్ముడయ్యే మార్కెటింగ్‌ ఈ పుస్తక ప్రదర్శన జరపాలి. అమ్మడం అంటే ఒక వ్యాపారం అది మా బాధ్యత కాదు అనడం సరికాదు. ఎంతో కష్టపడి రాసిన రచనలను, పుస్తక రూపంలో అచ్చు వేసిన ప్రచురణ కర్తలు నష్టపోయి, పుస్తక ప్రచురణకు వెనుకంజ వేసినప్పుడు పుస్తకాలే ఉండవు. అప్పుడు ఇటువంటి ప్రదర్శనలే ఉండవు. అలా అని ఇబ్బడి ముబ్బడిగా ప్రదర్శనలు, ప్రచురణలు చేయమని కాదు. మంచి పుస్తకాలను ఆదరించే పాఠకులు ఎప్పటికీ ఉంటారు. సెల్‌ ఫోన్‌ చూస్తూ పుస్తకాలను మరిచారని ఒక అపవాదు కూడా ఉంది. ఇటువంటి రూమర్స్‌ తప్పు అని నిరూపిస్తూ ప్రతి ఏడాది వేలమంది పుస్తక ప్రియులు, వందల కొద్ది కవులు, రచయితలు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు. రచయిత పాఠకులు ముఖాముఖి కలుసుకుని ఒక కుటుంబ ఉత్సవంలో పాల్గొన్నట్టు అందరూ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ పుస్తకాల చర్చ కొనసాగించాలని ఆశిస్తున్నాను. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజున కేటాయించి ఆ రోజంతా మహిళలకు సంబంధించిన రచనలను పుస్తకాలను చర్చించాలని కోరుతున్నాను.
– జ్వలిత
ఎస్‌.కె.సలీమా

Spread the love