నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే యొక్క సైన్స్ ఫిక్షన్ నవల ‘ఆర్బిటల్’ 2024 బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. 2019 తర్వాత బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి మహిళగా, 2020 తర్వాత అవార్డు గెలుచుకునే బ్రిటిష్ రచయిత్రిగా సమంత హార్వే నిలిచారు. ప్రైజ్ మనీ 50000 పౌండ్లు (సుమారు రూ. 53.78 లక్షలు)గా ప్రకటించారు. కేవలం 136 పేజీలున్న ‘ఆర్బిటల్’ బుకర్ ప్రైజ్ చరిత్రలో రెండవ చిన్న పుస్తకంగా నిలిచింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని ఆరుగురు వ్యోమగాముల కథే ‘ఆర్బిటల్’. అమెరికా, ఇటలీ, రష్యా, బ్రిటన్ మరియు జపాన్‌ల నుండి వచ్చిన వ్యోమగాములు ఒకే రోజులో 16 సూర్యోదయాలను వీక్షించి, భూగోళంలోని అత్యద్భుతమైన అందంలో మునిగిపోయారనడానికి ఒక సృజనాత్మక సాక్ష్యంగా ”’ఆర్బిటల్’ నవల నిలిచిపోయింది. అవార్డ్ కమిటీ ఛైర్మన్ ఎడ్మండ్ డి వాల్ మాట్లాడుతూ… “ఆధునిక రచనా శైలి, సమకాలీన కథాంశం పరంగా ఆర్బిటల్ ఇతర రచనల కంటే చాలా ముందు ఉంది” అని అన్నారు. ఈ అవార్డును భూమి మనుగడకు, శాంతి, స్వచ్ఛత పునరుద్ధరణకు అంకితం ఇస్తున్నట్లు సమంత హార్వే ప్రకటించారు. కోవిడ్ కాలంలో రాసిన ఈ నవల నవంబర్ 2023లో ప్రచురించబడింది. ఈసారి అవార్డుకు ఎంపికైన ఆరుగురిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం.