బ్రిటన్‌ రచయిత సమంత హార్వేకు బుకర్‌ ప్రైజ్‌

బ్రిటన్‌ రచయిత సమంత హార్వేకు బుకర్‌ ప్రైజ్‌లండన్‌ : ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారమైన బుకర్‌ ప్రైజ్‌ 2024 సంవత్సరానికి గాను బ్రిటన్‌కు చెందిన సమంత హార్వేని వరించింది. ఆమె రాసిన సైన్స్‌ ఫిక్షన్‌ నవల ‘ఆర్బిటల్‌’కు ఈ బహుమతి దక్కింది. 2019 తర్వాత బుకర్‌ బహుమతి అందుకోనున్న తొలి మహిళగా సమంత నిలిచారు. లండన్‌లో ఈ నెల 12న నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు ఆమెకు ట్రోపీని, రూ.53.78 లక్షలు (50000 పౌండ్లు) పారితోషికాన్ని పురస్కారం కింద అందజేశారు. ‘ఆర్బిటల్‌’ అనేది కేవలం 136 పేజీలున్న చిన్న నవల. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాముల జీవనయానమే కథా వస్తువు. అమెరికా, ఇటలీ, రష్యా, బ్రిటన్‌, జపాన్‌ నుండి వచ్చిన వ్యోమగాములు ఒకే రోజులో 16 సూర్యోదయాలను వీక్షించి, భూగోళంలోని అత్యద్భుతమైన అందంలో మునిగిపోయారంటూ వర్ణిస్తూ అత్యంత సజనాత్మక సాక్ష్యంగా ‘ఆర్బిటల్‌’ పాఠకులను కట్టిపడేస్తుందని పురస్కార కమిటీ ఛైర్మన్‌ ఎడ్మండ్‌ డి వాల్‌ అభినందించారు. ఆధునిక రచనా శైలి, సమకాలీన కథాంశం పరంగా ‘ఆర్బిటల్‌’ ఇతర రచనల కంటే అత్యుత్తమంగా నిలిచిందని వాల్‌ పేర్కొన్నారు. ఈ అవార్డును భూమి మనుగడకు, శాంతి పునరుద్ధరణకు అంకితం ఇస్తున్నట్లు సమంత హార్వే ప్రకటించారు. కోవిడ్‌ కాలంలో రాసిన ఈ నవల నవంబర్‌ 2023లో తొలిసారి ప్రచురితమైంది. కాగా ఈ దఫా బుకర్‌కు ఎంపికైన ఆరుగురిలో ఐదుగురు మహిళలే ఉండటం విశేషం.

Spread the love