– చంద్రబాబు, నితీశ్ వాటికి అనుకూలమే
– కార్పొరేట్ శక్తుల సేవకుడిగా మోడీ
– పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి శృంగభంగం
– ప్రజల్లో భరోసా కల్పించిన ఇండియా బ్లాక్
– దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే మా లక్ష్యం
– ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్న కేంద్రం
– సెస్ వసూళ్లలో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాలి
– రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమిస్తాం
– అవకాశవాద రాజకీయాలను బీఆర్‌ఎస్ వీడాలి
– మతోన్మాదంపై విశాల ప్రాతిపదికన పోరాడాలి : విస్తృత సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలే అమలవుతున్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఎన్డీయేకు మద్దతు ఇస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ కూడా సరళీకరణ విధానాలను వ్యతిరేకించబోరనీ, వాటికి మద్దతిస్తారని చెప్పారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం దేశానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు. కార్పొరేట్ శక్తులకు సేవకుడిగా మోడీ వ్యవహరిస్తారని విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, జాన్‌వెస్లీ, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్ అధ్యక్ష వర్గంగా సమావేశం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ భారత్ అభివృద్ధిని చూసి ప్రపంచమంతా దిగ్భ్రాంతికి గురవుతున్నదంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఈ పదేండ్లలో అంత అభివృద్ధి జరిగితే బీజేపీకి 303 నుంచి 240కి సీట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. మోడీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కుపైగా సీట్లు వస్తాయన్నారనీ, చావు తప్పి కన్ను లొట్ట బోయినట్టు ఆ పార్టీకి 240 సీట్లు వచ్చాయన్నారు. పదేండ్ల బీజేపీ పాలనలో రాజకీయ పార్టీలను చీల్చిందనీ, ఇద్దరు సీఎంలను జైల్లో పెట్టిందనీ, ప్రతిపక్ష నాయకులను అణచివేసిందని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లలో రూ.8 వేల కోట్లు బీజేపీకి వచ్చాయని చెప్పారు. 80 శాతం మీడియా, సోషల్ మీడియా, కార్పొరేట్ శక్తులు ఆ పార్టీకి వత్తాసు పలికాయని అన్నారు. అయినా బీజేపీ సీట్లు తగ్గాయని వివరించారు. ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక అసలు పాలన ముందుందంటున్నారని చెప్పారు. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలున్నాయనీ, 23న కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలను మోడీ ప్రభుత్వం ముమ్మరం చేస్తుందన్నారు.
ఉత్తరాదిన బీజేపీకి ఎదురుదెబ్బ
ఉత్తరాదిన బీజేపీకి సీట్లు తగ్గాయని రాఘవులు వివరించారు. యూపీ, మహారాష్ట్ర, బెంగాల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీకి సీట్లు రావడంతో అధికారంలోకి వచ్చిందన్నారు. హిందూత్వ మతోన్మాదాన్ని దేశమంతా వ్యాపింపజేసినా సీట్లు తగ్గాయని విమర్శించారు. కేరళలో బీజేపీ ఒక్కస్థానంలో గెలిచిందని అన్నారు. అక్కడ సీపీఐ(ఎం), వామపక్షాల ఓట్లు చేరి ఆ పార్టీకి రావడం ఆందోళనకరమని చెప్పారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నా చేజేతులా పోగొట్టుకుందని వివరించారు. మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని మోడీ ఏర్పాటు చేసినా వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలను అణచివేస్తారని చెప్పారు. మతోన్మాద ప్రమాదం పొంచి ఉందన్నారు. దేశంలో బీజేపీ పెరుగుదలను ఇండియా బ్లాక్ నిరోధించిందని చెప్పారు. బీజేపీని వదిలించుకోవడమే కర్తవ్యమంటూ ఆ కూటమిలోని పార్టీలు పనిచేశాయనీ, ప్రజల్లో భరోసాను కల్పించాయని వివరించారు. ఇండియా బ్లాక్ విచ్ఛిన్నం కాకుండా సీపీఐ(ఎం) విశేష కృషి చేసిందన్నారు. కేరళలో సీపీఐ(ఎం)ను ఓడించాలంటూ రాహుల్, రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్ మాట్లాడారని గుర్తు చేశారు. తాము నష్టపోయినా దేశం నష్టపోకుండా సంయమనంతో వ్యవహరించామని చెప్పారు. మమతా బెనర్జీకి నష్టం కలగకుండా బెంగాల్‌కు కాంగ్రెస్ ముఖ్యనాయకులెవరూ రాలేదన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడ్డమే సీపీఐ(ఎం) లక్ష్యమని చెప్పారు. ఇండియా బ్లాక్‌లో భాగస్వామిగా ఉంటూనే దేశభక్తిని చాటుకున్నామని అన్నారు.
తెలంగాణలో బీజేపీని నిలువరించాలి
తెలంగాణలో నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు బీజేపీకి పెరిగిందని రాఘవులు చెప్పారు. 19 నుంచి 35 శాతానికి ఓట్ల శాతం పెరిగిందన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని సైద్ధాంతికంగా, రాజకీయంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి కూడా నెరవేర్చాలని కోరారు. ఫెడరల్ హక్కుల మీద కేంద్రం దాడి చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాలకు నిధులను తగ్గించడం కోసం పనగారియా నేతృత్వంలో ఫైనాన్స్ కమిషన్‌ను నియమించిందని గుర్తు చేశారు. పన్నుల్లో 30 శాతం వాటాను కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్నదనీ, దాన్ని 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. తమ నిధుల కోసం కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ఢిల్లీలో వేర్వేరుగా ధర్నా చేశాయని గుర్తు చేశారు. అదే తరహాలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. జీఎస్టీకి ఎక్కువ పన్నులు రాకుండా ఉండేందుకు కేంద్రం సెస్‌ల రూపంలో వసూలు చేస్తున్నదని చెప్పారు.
అందులో రాష్ట్రాలకు వాటా లేదన్నారు. రాష్ట్రాలకూ సెస్ వసూళ్లలో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భాగస్వామి కావాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు, లేబర్ కోడ్‌లు కేంద్రం తెచ్చిందనీ, వాటిని అమలు చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. ఆశాలకు పరీక్ష పెట్టాలని కేంద్రం చెప్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రజలకు నష్టం చేసే విధానాలను అమలు చేయబోమంటూ కేంద్రాన్ని ఎదిరించాలన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని అన్నారు. అప్పులు చేసుకోనివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నదని విమర్శించారు. కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి రూ. ఐదు వేల కోట్లు అప్పు తెచ్చుకుందని గుర్తు చేశారు. మెదక్ జిల్లాలో బీజేపీ నాయకులు మైనార్టీల ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. ఆ ఘటనలను కాంగ్రెస్ ఖండించలేదన్నారు. ఇది రాష్ట్రాభివృద్ధికి హానికరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. అసంతృప్తి రాకుండా హామీలను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ హామీలపై మాట్లాడే కిషన్‌రెడ్డికి కేంద్రం హామీలు, ప్రజలపై మోపే భారాలపై చెప్పే దమ్మూధైర్యం ఉందా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిని చేసి నిలువరించాలని పిలుపునిచ్చారు.
మతోన్మాదంపై పోరాడాలి
‘ఈ దేశానికి మతోన్మాదం పనికిరాదు. లౌకికవాదం కావాలి. నిరంకుశత్వం వద్దు. ప్రజాస్వామ్యం కావాలి. సనాతన ధర్మం సృష్టించే మనువాదం ఉండొద్దు. సమానత్వం కావాలి. కులవివక్ష ఉండొద్దు, సామాజిక న్యాయం కావాలి.’అని రాఘవులు చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మనువాద రాజ్యాంగాన్ని తేవాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఈ లక్ష్యాలు సాధించాలంటే కమ్యూనిస్టులతోపాటు రాజ్యాంగాన్ని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడే వారు కలిసి రావాలని కోరారు. సమస్య ప్రాతిపదికన కేంద్రానికి మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం రాజకీయం కాదనీ, లొంగుబాటుతనం అవుతుందన్నారు. అవకాశవాదంతో వ్యవహరించడం సరైంది కాదని చెప్పారు. బీజేపీతో అంటకాగిన బీజేడీ, వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాలన్నారు. బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ ఉండాలంటే సమస్యలపై నిక్కచ్చిగా పోరాడాలనీ, మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పారు. అవకాశవాద రాజకీయాలను విడనాడాలని సూచించారు. దేశ సమైక్యత, సమగ్రత, సంక్షేమాన్ని కోరుకునే వారు కలిసి రావాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వంపై పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, డిజి నరసింహారావు, పాలడుగు భాస్కర్, టి సాగర్, పి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.