ఆ ఇద్దరికే సాధ్యం!

Both of them are possible!– లో స్కోరు డిఫెన్స్‌లో రోహిత్‌-బుమ్రా మ్యాజిక్‌
– అభిమానులకు మంచి కిక్కు ఇచ్చిన న్యూయార్క్‌ ఫైట్‌
– ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2024
20 ఓవర్లలో 120 పరుగులు. ఆధునిక క్రికెట్‌లో ఇదో సవాలే కాదు. ఐపీఎల్‌లో పవర్‌ప్లేలోనే అంతకంటే ఎక్కువ స్కోర్లు చూసిన క్రికెట్‌ అభిమానులకు న్యూయార్క్‌లో టీమ్‌ ఇండియా సరికొత్త అనుభూతి అందించింది. ఐపీఎల్‌లో స్వల్ప స్కోర్లను విజయవంతంగా నిలుపుకున్న జోడీ రోహిత్‌-బుమ్రా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ ఆ మ్యాజిక్‌ పునరావృతం చేసింది. స్వల్ప స్కోర్ల మ్యాచ్‌ తొలుత చప్పగా అనిపించినా.. భారత బౌలర్ల మెరుపులతో చిరస్మరణీయ మ్యాచ్‌గా నిలువనుంది!.
నవతెలంగాణ క్రీడావిభాగం
బ్యాటర్లు 119 పరుగులకే కుప్పకూలిన మ్యాచ్‌లో.. ప్రత్యర్థి వికెట్ల వేటలో ఉత్తమ బౌలర్‌ను ఆరంభంలోనే అతిగా ప్రయోగించటం చూస్తూనే ఉంటాం. స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు ప్రత్యర్థి పది వికెట్లు అవశ్యమని క్రికెట్‌ పండితులు సైతం చెబుతారు. కానీ లో స్కోర్‌ డిఫెన్స్‌ ఓ కళ అని.. అందుకు వికెట్ల కోసం ఆరాట పడకుండా ఉండటమే అసలు విన్నింగ్‌ ఫార్ములా అని రోహిత్‌ శర్మ, జశ్‌ప్రీత్‌ బుమ్రా నిరూపించారు. వర్షం అంతరాయంతో ఆదివారం అర్థ రాత్రి అనంతరం ముగిసిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత భారత్‌ 119 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో పాకిస్థాన్‌ 113 పరుగులే చేసింది.
రోహిత్‌, బుమ్రా మ్యాజిక్‌ : భారత జట్టులో కొంతమంది ఐపీఎల్‌ కెప్టెన్లు ఉన్నారు. టర్నింగ్‌, స్లో పిచ్‌లపై అందరూ స్వల్ప స్కోర్ల డిఫెన్స్‌ ఉత్కంఠను చవిచూసినవారే. చిన్న స్కోర్లను నిలుపుకునే ఫార్ములా సింపుల్‌. టీ20లు వన్డేల తరహా కాదు. మ్యాచ్‌ సమీకరణాలు వేగంగా మారతాయి. వికెట్ల కోసం తొందరపడకుండా.. ప్రత్యర్థి పరుగుల సాధన అవకాశాలను నియంత్రిస్తే చాలు. ఐపీఎల్‌ ఫైనల్లో 129-149 మధ్య స్కోర్లను కాపాడుకున్న జట్టులో ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ భాగస్వామ్యం ఉంది. డెక్కన్‌ చార్జర్స్‌తో, ముంబయి ఇండియన్స్‌తో రోహిత్‌, బుమ్రా ఈ పరిస్థితులు చూశారు. ఈ నాలుగు మ్యాచుల్లో ఒక్కదాంట్లో ఆరంభంలో వికెట్లు పడటంతో విజయం లభించగా.. మూడు మ్యాచులు ఆఖరు బంతి వరకు వెళ్లాయి. ఆ అనుభవం న్యూయార్క్‌లో 119 కాపాడుకునేందుకు పనికొచ్చింది. జశ్‌ప్రీత్‌ బుమ్రా నాలుగు ఓవర్లలో 14 పరుగులకే 3 వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆరంభంలో పాకిస్థాన్‌ కీలక భాగస్వామ్యాలు నమోదు చేసినా వికెట్ల కోసం జశ్‌ప్రీత్‌ బుమ్రాను ప్రయోగించాలనే ఉత్సుకత రోహిత్‌ చూపించలేదు. సహజంగా ఏ కెప్టెన్‌ అయినా.. ఇటువంటి మ్యాచుల్లో ఆరంభంలో భాగస్వామ్యాలను విడగొట్టాలను చూస్తారు. 120 ఛేదనలో పాకిస్థాన్‌ 72/2తో సాగుతున్నప్పుడు పరిస్థితుల ప్రకారం అలా చేయటం సబబే. కానీ రోహిత్‌ శర్మ ఆ పని చేయలేదు.
వినూత్నంగా ఆడాలి : టీ20 క్రికెట్‌ ఎప్పటికప్పుడు సరికొత్తగా మారుతుంది. పెద్ద బౌండరీలు, సంప్రదాయ షాట్లకు అనువుగా ఫీల్డింగ్‌ మొహరింపులు, బౌలర్లకు పిచ్‌ నుంచి అదనపు స్వింగ్‌, సీమ్‌ దక్కినప్పుడు.. బ్యాటర్లు విలక్షణ షాట్లతో ముందుకు రావాలి. పాక్‌ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్లో అర్షదీప్‌ సింగ్‌పై నసీం షా అటువంటి షాట్లు ఆడాడు. పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో విలక్షణ షాట్లు ఆడిన ఏకైక బ్యాటర్‌ టెయిలెండర్‌ నషీం షా. న్యూయార్క్‌లో రిషబ్‌ పంత్‌ అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. అందుకు ప్రధాన కారణం, పరుగుల వేటలో పంత్‌ కొత్త షాట్లను ఆశ్రయిస్తున్నాడు. ప్రత్యర్థి కెప్టెన్‌, బౌలర్‌ ఊహించని దిశలో షాట్లు ఆడుతూ పరుగులు పిండుకుంటున్నాడు. రివర్స్‌ స్వీప్స్‌, స్వీప్స్‌, ర్యాంప్స్‌ షాట్లతో పాకిస్థాన్‌ కంటే భారత్‌ 12 పరుగులు అధికంగా సాధించింది. భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించగా.. అత్యంత ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్‌లో విలక్షణ షాట్ల పాత్ర వెలకట్టలేనిది. భారత జట్టు మేనేజ్‌మెంట్‌ రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లకు మద్దతు నిలుస్తూ అవకాశాలు ఇవ్వటం వెనుక ఇదే ప్రధాన కారణం. పాకిస్థాన్‌ బ్యాటర్లు సంప్రదాయ షాట్ల కోసం ఎదురుచూసి మూల్యం చెల్లించారు.
భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గెలుపు వ్యత్యాసం 6 పరుగులు. కానీ ఇరు జట్ల మధ్య అగాధం చాలా ఎక్కువ. వర్షం కురిసిన మ్యాచ్‌లో, పేసర్లకు అనుకూలించే పిచ్‌పై టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ బయటపడింది. ప్రతికూల పరిస్థితుల్లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు వచ్చినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నా పరుగుల వేటలో ఎదురుదాడి చేసేందుకే మొగ్గుచూపింది. ఇటువంటి దూకుడు స్వభావం భారత జట్టులో గతంలో పెద్దగా చూడలేదు.
పిచ్‌ నుంచి సహకారం ఉన్నప్పుడు వికెట్ల వేటలో మ్యాజిక్‌ బంతి కోసం ఆరాట పడటం సహజం. కానీ నేను ఆ పని చేయాలని అనుకోలేదు. పిచ్‌ నుంచి సీమ్‌, స్వింగ్‌ సైతం తగ్గింది. మ్యాజిక్‌ బాల్స్‌ కోసం ప్రయత్నిస్తే అత్యంత కచ్చితంగా సంధించాలి. లేదంటే, పరుగుల వేట ప్రత్యర్థికి సులభతరం అవుతుంది. అందుకే వికెట్ల కోసం వెళ్లలేదు. బ్యాటర్లపై ఒత్తిడి పడేలా చేశాం. మా ప్రణాళిక అమలు చేశాం, అందరం వికెట్లు పడగొట్టాం
– జశ్‌ప్రీత్‌ బుమ్రా

Spread the love