అటు విమోచన..ఇటు సమైక్యత

That's redemption..that's integration– నాటి వాడివేడి నేడు లేదు
– సెప్టెంబర్‌ 17 వేడుకల్లో చప్పగా అమిత్‌షా, కేసీఆర్‌ ప్రసంగాలు
– రాజకీయంగా పల్లెత్తు మాటకూడా అనుకోని వైనం
– బీజేపీ-బీఆర్‌ఎస్‌ మైత్రిలో భాగమేనంటున్న విశ్లేషకులు
– అమిత్‌షా సభలో ఓవైపు జనగణమన గీతం..మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ పాట
– సగం గీతం అయిపోయాక పాట ఆపిన వైనం
– విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా
– షోయబుల్లాఖాన్‌, రాంజీ గోండు పేరిట పోస్టల్‌ కవర్ల విడుదల
– స్వశస్త్ర సీమాబల్‌ క్వార్టర్లకు వర్చువల్‌గా శంకుస్థాపన
– వికలాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నిన్నటి మొన్నటిదాకా బీజేపీ అంటేనే ఒంటి కాలుపై లేచిన సీఎం కేసీఆర్‌…ఇటు బీఆర్‌ఎస్‌పై అగ్గిమీద గుగ్గిలం అయిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మాటల్లో తేడా సెప్టెంబర్‌ 17 వేడుకల సందర్భంగా స్పష్టంగా కనిపించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం పేరిట, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమైఖ్యతా దినోత్సవం పేరిట నిర్వహించిన వేడుకల్లో వారిద్దరి ప్రసంగాలు చప్పగా సాగాయి. గత విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్‌షా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ పార్టీని పొట్టుపొట్టుగా అర్సుకోగా..ఈ సారి ప్రసంగంలో ఆ వేడి ఎక్కడా కనిపించలేదు. పటేల్‌ జపం చేశారే తప్ప బీఆర్‌ఎస్‌పై ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయలేదు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ఎప్పుడూ చెప్పే మాటా వినబడలేదు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమైఖ్యతా దినోత్సవంలో కూడా బీజేపీని కేసీఆర్‌ పల్లెత్తు మాట అనలేదు. ఏడాది కాలంగా బీజేపీ మతతత్వ పార్టీ.. మత పిచ్చిగాళ్లు…ఆర్థికంగా దేశాన్ని దివాళా తీయిస్తున్నది.. అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఇరువురి వైఖరిలో ఈ మార్పు రావడానికి బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య అంతర్గత మైత్రీలో భాగమేనంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొంతకాలంగా ఇదే విషయం జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. తెలంగాణలో బీజేపీకి ఎలాగూ అవకాశం లేదు. తాజా రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్‌తో ఢ అంటే ఢ అనే స్థాయికి కాంగ్రెస్‌ పార్టీ చేరుకున్నది. బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాల్లో గతం కంటే ఎంపీ సీట్లు తక్కువ వచ్చే అవకాశముండటం, కర్నాటకలో ఆ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో లోక్‌సభలో చాలామేర సీట్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు ఎదిగినా సరేగానీ కాంగ్రెస్‌ను ఎక్కడా తిరిగి పుంజుకోనివ్వొద్దనే ఆలోచనకు బీజేపీ వచ్చినట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీకి తెలంగాణలో ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా లబ్ది చేకూర్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుండా దెబ్బతీయటం, ఎంపీ సీట్లు ఎక్కువ గెలువనివ్వకుండా చేయడంలో భాగంగానే బీజేపీ ఈ వైఖరి తీసుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతున్నది. అందుకే అమిత్‌ షా ప్రసంగంలో కేసీఆర్‌ను పల్లెత్తు మాట కూడా అనలేదనే చర్చ నడుస్తున్నది.
జెండావిష్కరణలో ఓవైపు జనగనమణ …మరోవైపు హిందూ సదా వత్సలే మాతృభూమి (బాక్సు ఐటమ్‌)
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో నిజాం వ్యతిరేక పోరాటానికి సంబంధంలేని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పాటలు పాడటం పలు విమర్శలకు తావిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ‘నమస్తే సదా వత్సలే మాతృభూమే…ప్రభోశక్తి మన హిందూ రాష్ట్రాంగ….’, ‘జయ జయహే భారతి..జగమంత కోరు నీ సంస్కృతి….ఆరాధన మంత్రం..అనాదిగా ఇది మనకు ప్రబోధం..పునాదిగా ప్రబవించిన వేదం..’ అంటూ గాయకులు ఆర్‌ఎస్‌ఎస్‌ పాటలు పాడటం చర్చనీయాంశమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన తర్వాత అందరూ జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా..సింగర్లు మాత్రం ‘నమస్తే సదా వత్సలే మాతృభూమే..ప్రభోశక్తి మన హిందూ రాష్ట్రాంగ..’ అంటూ పాటడం విమర్శలకు తావిచ్చింది. ఇదేంటని కొందరు వారించగా..జాతీయ గీతం సగం పూర్తయిన తర్వాత ఆ పాటను ఆపేశారు. జాతీయ గీతం మొదలవ్వగానే అందరూ లేచి పాడటం నిజమైన దేశభక్తులు చేసే పని. ఆ ముసుగేసుకుని జాతీయ జెండావిష్కరణ సమయంలో ఈ పాట పాడటమే ఇప్పుడు బీజేపీ తీరుపై విమర్శలకు తావిస్తున్నది.
పటేల్‌ చొరవతోనే హైదరాబాద్‌ విలీనం
సర్దార్‌ వల్లభభారు పటేల్‌ చొరవతోనే హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి లభించిందనీ, చుక్క రక్తం బొట్టు కారకుండా హైదరాబాద్‌ విలీనానికి నిజాం అంగీకరించేలా ఆయన మెడలు వంచారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మొదట అమిత్‌షా పరేడ్‌ గ్రౌండ్‌లో సైనిక అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. సాయుధ భద్రతా దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. షోయబుల్లాఖాన్‌, రాంజీ గోండు పేరిట పోస్టల్‌ కవర్లను ఆవిష్కరించారు. నిజాం సంస్థానం పరిధిలోని తెలంగాణ, కళ్యాణ కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలను తిలకించారు. వికలాంగులకు బ్యాటరీ సైకిళ్లను పంపిణీచేశారు. సాయుధ బలగాల కోసం 80 ఎకరాల స్థలంలో నిర్మించనున్న స్వశస్త్ర సీమా బల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. దేశంలో విలీనానికి ముందు తెలంగాణ, కళ్యాణ కర్నాటక, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు హైదరాబాద్‌ సంస్థానంలో ఉండేవని గుర్తుచేశారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించినవారికి నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు. నిజాం రాజు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు పటేల్‌ చొరవ తీసుకున్నారనీ, పటేల్‌, మున్షీ కలిసి ఆపరేషన్‌ పోలో పేరిట నిజాం, రజాకార్ల మెడలు వంచారని చెప్పారు. హైదరాబాద్‌ విమోచనానికి 75 ఏండ్లు నిండాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే గత ప్రభుత్వాలు విమోచన దినోత్సవాలను నిర్వహిం చలేదని విమర్శించారు. విమోచన దినోత్సవం చరిత్ర గురించి ఏమాత్రం పట్టింపు లేని వారిని ప్రజలు కూడా పట్టించుకోబోరని హెచ్చరించారు. హైదరాబాద్‌ సంస్థానంలో మన పూర్వీకులు చేసిన బలిదానాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. జీ-20 సదస్సు విజయవంతం గా నిర్వహించామనీ, దీని ద్వారా ప్రపంచ దేశాలకు భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిశా యని చెప్పారు. జీ-20 ఇప్పుడు జీ-21గా మారిందన్నారు. జీ-20 నిర్వహణ, చంద్రయాన్‌ విజయవంతంతో మన దేశం విశ్వగురువు స్థానం లో నిలిచిందన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..అనేక వేల మంది ప్రాణత్యాగాల వల్ల నిజాం సంస్థాన ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత మనకు స్వాతంత్య్రం లభించిందని చెప్పారు. ఆ కాలంలో ఖాసీం రజ్వీ పేద ప్రజల మీద ఆకృత్యాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు. రజాకార్ల ఆగడాలకు తట్టులేక గ్రామాల్లోని ప్రజలంతా ఒక్కటై తిరగబడి విజయం సాధించారన్నారు. 75 ఏండ్లుగా తెలంగాణ చరిత్రను రాజకీయ లబ్ది కోసం కొందరు తొక్కిపెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు బార్లీ, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, సాయుధ బలగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love