– నవతెలంగాణ విలేఖరిని పరామర్శించిన పాయం, శ్రీవాణి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల పరిధిలోని అనంతోగు గ్రామ సమీపంలోని మార్శెల వాగు దగ్గర ఆళ్ళపల్లికి చెందిన ఇరువురు విలేఖరులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఇరువురు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ మహమ్మద్ ఫయీమ్, మనతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ బూరుగడ్డ సత్యనారాయణ పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు న్యూస్ కవరేజ్ నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై ముత్తాపురం గ్రామానికి వెళ్లాలని ఆదివారం ఉదయం బయలుదేరారు. మార్గం మధ్యలో అనంతోగు సమీపంలోని మార్శెల వాగు దగ్గర రోడ్డుపై ఇరుపక్కలా మడ్డితో కూడిన ఇసుక మేటేసి ఉండటం, ఎదురుగా వేగంగా జామాయిల్ మొక్కలతో వస్తున్న టాటా మ్యాజిక్ మీదికి రావడంతో, దాన్ని తప్పించబోయి బైక్ జారీ ఇరువురం పడ్డాం. దాంతో ఫయీమ్ కుడి మోకాలు బీటీ రోడ్డు ను ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బ తగలగా, కుడి పక్కన కంత, భుజానికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. అలాగే మనతెలంగాణ రిపోర్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇరువురి కుటుంబ సభ్యులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారని ఊపిరిపీల్చుకున్నారు. ఇరువురు విలేకరులు ప్రమాదకరమైన చోట నిర్లక్ష్యంగా, అతివేగంగా టాటా మ్యాజిక్ నడిపిన డ్రైవర్ ను అదుపులో తీసుకుని, అతని పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సై రతీష్ ను కోరారు.
కాగా, మండలంలో పర్యటిస్తున్న పాయం వెంకటేశ్వర్లు జరిగిన ఘటనను తోటి సహచరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన నవతెలంగాణ ప్రతినిధి ఇంటికి చేరుకుని, పరామర్శించారు. ఇదిలా ఉంటే ఆళ్ళపల్లి మండలంలో పర్యటిస్తున్న రానున్న ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆశావహులు, కరకగూడెం వరుసగా మూడు సార్లు సర్పంచ్ గా ఉన్న పోలెబోయిన శ్రీవాణి అనుచరలతో విషయం తెలుసుకుని ఫయీమ్, సత్యనారాయణ లను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు, పోలెబోయిన శ్రీవాణి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు రోడ్ల పై మడ్డితో కూడిన ఇసుక మేటేసి ఉండటం పరిశీలించాలని అన్నారు. పేరుకున్న ఇసుకను వెంటనే తీపీయాలని లేదంటే పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఎదురుగా పెద్ద వాహనాలు వచ్చిన క్రమంలో ద్విచక్ర వాహన దారులు సైడ్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ సైడ్ ఇచ్చినా కిందపడే అవకాశం ఎక్కువగా ఉంన్నాయన్నారు. ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే ద్విచక్ర వాహన దారులు ఇలా ఇసుక ఉన్న చోట సమస్య తీరే వరకు చూసి నడపాలన్నారు. వర్షాలు ఆగి పోయి సుమారు వారం రోజులైందని, ఇకనైనా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెను ప్రమాదాలు సంభవించక ముందే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.