8వ అంతస్తు నుంచి కిందపడి బాలుడు మృతి..

నవతెలంగాణ – లక్నో: ఒక బాలుడు తల్లిదండ్రుల కంటే ముందే నిద్ర లేచాడు. అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ 8వ అంతస్తు నుంచి కిందపడి మరణించాడు.  ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 78లో ఉన్న హైడ్ పార్క్ సొసైటీ అపార్ట్‌మెంట్‌ కాంపెక్స్‌లోని ఒక బిల్డింగ్‌ 8వ అంతస్తులో ఒక కుటుంబం నివసిస్తున్నది. అయితే శుక్రవారం ఉదయం 5.45 గంటలకు 5 ఏళ్ల బాలుడు నిద్ర నుంచి లేచాడు. బాల్కానీలోకి వెళ్లి అక్కడి గ్రిల్‌ నుంచి కిందకు పడ్డాడు. బిల్డింగ్‌ 8వ అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, తమ ఐదేళ్ల కుమారుడు అప్పుడప్పుడు తమ కంటే ముందుగానే మేల్కొంటాడని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. నిద్ర నుంచి లేచిన తర్వాత అన్ని గదుల్లో తిరుగుతుంటాడని చెప్పారు. మరోవైపు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యుల కన్నా ముందే నిద్రలేచిన ఆ బాలుడు మొక్కల కుండీలు ఉండే బాల్కానీలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మొక్కల కుండీలపైకి ఎక్కిన ఆ చిన్నారి బాల్కానీ గ్రిల్‌ నుంచి కింద పడి చనిపోయినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

Spread the love