– ఐదేండ్ల కృషితో ప్రజలకు మరింత చేరువైన ఎస్. వెంకటేషన్
– యువత, సాహితీవేత్తలతో ప్రత్యేక అనుబంధం
– కరోనా కాలంలో ప్రజల్లోనే ఉండే నేతగా ముద్ర
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధపు ప్రచారం
– ఆ గుట్టు విప్పుతున్న వెంకటేషన్
– నవతెలంగాణ నుంచి జగదీష్
తమిళనాడు, మదురై అభివృద్ధికి ఐదేండ్ల పాటు ఎంపీగా చేసిన కృషితో సీపీఐ(ఎం) మదురై లోక్‌సభ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ ఎస్. వెంకటేషన్ ప్రజలకు చేరువవుతున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతైన ఆయన తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. మదురై ఎయిమ్స్ నిర్మాణం 95 శాతం పూర్తైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడైన వెంకటేషన్ పచ్చి అబద్ధమని బట్టబయలు చేశారు. జేపీ నడ్డా వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే వెంకటేషన్ ఎయిమ్స్ ప్రతిపాదిత ప్రాంతం తోపూర్‌కు వెళ్లారు. ‘ఎయిమ్స్ ఎక్కడ ఉంది?’ అనే సున్నితమైన భాషలో ప్లకార్డును పట్టుకుని నిరసన తెలిపారు. అక్కడ కనీసం ఒక్క భవనానికి కూడా పునాది రాయే వేయలేదు. ఈ అంశం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ప్రయోజనాల కోసం చర్చలు జరుగుతున్నప్పుడు ఇలా బాధ్యతా యుతమైన స్థానంలో ఉన్న జేపీ నడ్డా చేసిన ఈ అబద్ధపు వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.
తమిళనాడు గొంతుకై…
2019 నుంచి తమిళనాడు గొంతుకై పార్లమెంట్‌లో తన గళాన్ని లేవనెత్తుతున్న ఎస్.వెంకటేషన్, లోక్‌సభకు మళ్లీ ఎన్నిక కావాలని మదురై ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపీగా వెంకటేషన్ నియోజకవర్గానికి ఐదేండ్లుగా చేసిన కార్యక్రమాలు, అభివృద్ధిని మళ్లీ ప్రజలకు చేరువ చేస్తున్నారు. 2023లో ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులను ఏకతాటిపైకి తెచ్చి ఏర్పాటు చేసిన ముఖాముఖి తమిళనాడుకు కొత్త అనుభూతినిచ్చింది. కోవిడ్ కాలంలో అన్ని ఇతర కార్యకలాపాల మధ్య, నియోజకవర్గ ప్రజలకు కూరగాయలు, నిత్యావసరాలను పంపిణీ చేయడానికి ఎంపీ స్వయంగా రంగంలోకి దిగడంతో ప్రజల్లో విశేష ఆదరణ పొందగలిగారు. హిందీని జొప్పించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను ముందు నుంచి ప్రతిఘటించారు. ఆలయాల నగరమైన మధురైకి వినూత్నమైన అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకురావడానికి, యువతకు మరిన్ని విద్యా, ఉపాధి అవకాశాలను అందించడానికి కృషి చేశారు. ఈ ‘కవల్‌కోట’ రచయితను మధురై వాసులు ‘సన్ ఆఫ్ వైగా’ అని పిలుచుకుంటారు. మదురైకి, సంస్కృతికి మూలమైన వైగా నదికి నమస్కరిస్తూ వెంకటేషన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన అభివృద్ధి, పర్యావరణాన్ని మిళితం చేసే తమిళనాడు ముర్పోక్ ఎజుతలార్ సంఘానికి నాయకుడుగా ఉన్నారు. యువతతో సహా అన్ని వర్గాల ప్రజల నుంచి బలమైన మద్దతును చూరగొన్నారు.
జోరుగా ప్రచారం
వెంకటేషన్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన గెలుపు కోసం సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలు, ఇండియా ఫోరం నేతలతో పాటు కవులు, రచయితలు, సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ సినీ నటి రోహిణి సైతం రోజూ వెంకటేషన్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మహిళలు, యువత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు.
సీపీఐ(ఎం)కు బలమైన కేంద్రం మదురై
మదురై లోక్‌సభ నియోజకవర్గం మదురై తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య, మేలూర్ అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉంది. సీపీఐ(ఎం)కు బలమైన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గానికి 1999-2004లో పి మోహన్ సీపీఐ(ఎం) నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు 1967లో సీపీఐ(ఎం) సీనియర్ నేత పి.రామమూర్తి ఎంపీగా ఉన్నారు. 1957లో సీపీఐకి చెందిన కెటికె తంగమణి ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వెంకటేషన్ 44.20 శాతం ఓట్లతో అన్నాడీఎంకె అభ్యర్థి వివిఆర్ రాజ్ సత్యన్‌పై 1,34,119 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఏఐఏడీఎంకేకు చెందిన పి. శరవణన్, బీజేపీకిి చెందిన రామ శ్రీనివాసన్ ఆయన ప్రత్యర్థులుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో ఈనెల 19న తమిళనాడులో ఎన్నికల జరగనున్నాయి.