– 6261 ప్రత్యేక బస్సులు
– ఒక్కరోజులోనే 52.78 లక్షల మంది ప్రయాణం
– ‘మహాలక్ష్మి’తో ఓఆర్ ఫుల్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కి ప్రయాణీకులు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ నిర్దేశించుకున్న ప్రత్యేక బస్సులకంటే అదనంగా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘మహాలక్ష్మి’ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అన్ని ప్రాంతాల మహిళలు వినియోగించుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పరస్పరం సహకరించుకొని, ముందస్తు ప్రణాళికకు మించి అదనపు బస్సుల్ని నడిపారు. సంక్రాంతి సందర్భంగా 4484 ప్రత్యేక బస్సుల్ని నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మహాలక్ష్మి పథకం నేపధ్యంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందే అంచనా వేసి, గత ఏడాదికంటే అధిక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఆ అంచనాలకు మించి ప్రయాణీకుల నుంచి రద్దీ ఏర్పడింది. దీనితో 6,261 ప్రత్యేక బస్సుల్ని నడిపినట్టు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ఈనెల 13వ తేదీ ఒక్కరోజే 1,861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపామనీ, దానిలో 1,127 హైదరాబాద్ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం తదితర రూట్లలో తిప్పామని ఆయన వెల్లడించారు. ఈనెల 13వ తేదీ ఒక్క రోజే 52.78 లక్షల మందిని ఆర్టీసీ సిబ్బంది సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారనీ, దానిలో సగానికిపైగా మహిళా ప్రయాణీకులే ఉన్నారని ఎమ్‌డీ వివరించారు. ముందస్తు ప్రణాళిక, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ప్రశాంతంగా ప్రయాణీకులను సొంతూళ్లకు సంస్థ చేర్చామన్నారు. తొలిసారిగా బస్‌భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులు, ప్రయాణీకులకు ఎమ్‌డీ సజ్జనార్ ప్రత్యేక కతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.