ఆర్టీసీ విలీనానికి బ్రేక్‌! అసెంబ్లీలో బిల్లు డౌటే

– గవర్నర్‌ ఆమోదించలేదంటున్న ప్రభుత్వొం ఒక్కరోజు ముందు పంపారంటున్న రాజ్‌భవన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది. దీనికి సంబంధించిన బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని మంత్రి కే తారకరామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుకు గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఆమోదం తెలుపలేదంటూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రచారం మొదలైంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ వ్యతిరేకిస్తున్నారనేది ఆ కథనాల సారాంశం. ఆర్థికాంశాలతో ముడిపడిన బిల్లు కావడంతో సాంకేతికంగా దీనికి గవర్నర్‌ ఆమోదం తప్పనిసరి అయ్యిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనిపై గవర్నర్‌ కార్యాలయం కూడా ధీటుగా స్పందించింది. ఆ మేరకు గవర్నర్‌ కార్యాయలం ప్రెస్‌ సెక్రటరీ శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు పంపిందనీ, అప్పటికే పుదుచ్చేరి ఇంచార్జి గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తున్న తమిళసై ఆ రాష్ట్రంలో ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 3వ తేదీనే ప్రారంభమయ్యాయనీ, సదరు బిల్లుపై గవర్నర్‌ న్యాయ సలహా తీసుకోవాల్సి ఉంటుందనీ, దీనికి కొంత సమయం పడుతుందని వివరణ ఇచ్చారు. మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ రాజకీయరంగు పులుముకొని వివాదాస్పదంగా మారింది. అయితే అధికారికంగా ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదు.

Spread the love