స్ట్రాంగ్‌ రూమ్‌ తాళం పగలగొట్టండి

– మంత్రి కొప్పుల ఎన్నిక వివాదంపై హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీల్‌ వేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాన్ని పగులగొట్టేందుకు కలెక్టర్‌కు అనుమతిచ్చింది. కొప్పుల ఎన్నిక చెల్లదనీ, లెక్కింపులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం మరోమారు విచారించింది. ఎన్నికకు సంబంధించిన డాక్యుమెంట్లు, వీవీప్యాట్లు, సీసీ ఫుటేజీ కావాలని లక్ష్మణ్‌ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు..లక్ష్మణ్‌ అడిగిన సమాచారం ఇవ్వాలని గతంలోనే రిటర్నింగ్‌ అధికారికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవన్నీ స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారి ఆ సమయంలో చెప్పారు. దాని తాళాలు తెరిచి అడిగినవన్నీ ఇవ్వాలని ఆ తర్వాత కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ఇటీవల ధర్మపురిలో స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచేందుకు కలెక్టర్‌ ప్రయత్నించారు. మూడు గదుల్లో ఎన్నికల సామాగ్రి ఉండగా..ఒకగది తాళాలు తెరవలేకపోయారు. తాళం చెవి లేకపోవడంతో ఆ రూమ్‌ను తెరవలేకపోయామని కలెక్టర్‌ న్యాయస్థానానికి తెలిపారు. ఆ డాక్యుమెంట్లు కావాలంటే స్ట్రాంగ్‌ రూమ్‌ తాళం పగులగొట్టడమే ప్రత్యామ్నాయమని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పోయిన అంశంపై ముగ్గురు అధికారులతో విచారణ జరిపిస్తున్నామనీ, పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని ఎన్నికల అధికారులు ధర్మాసనానికి తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే తాళం చెవి మాయం చేశారనీ, అక్రమాలకు పాల్పడ్డారని లక్ష్మణ్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు స్ట్రాంగ్‌ రూమ్‌ సీల్‌ పగలగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్‌కు అనుమతించింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరవాలని సూచించింది. రిటర్నింగ్‌ అధికారి కోరితే వాహనం, తగిన భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్‌స్మిత్‌ సహకారం తీసుకునేందుకు కూడా అనుమతిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

Spread the love