గాజాపై చర్చిస్తున్న బ్రిక్స్‌ నేతలు

జోహాన్నెస్‌బర్గ్‌ : గాజాలో నెలకొన్న పరిస్థితులపై మంగళవారం బ్రిక్స్‌ సదస్సు జరిగింది. గత ఆరు వారాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం పట్ల ఉమ్మడి ప్రతిస్పందన రూపొందించేందుకు గానూ బ్రిక్స్‌ నేతలు సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా నిర్వహణలో ఈ సదస్సు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో బ్రిక్స్‌లో సభ్యులుగా చేరనున్న సౌదీ అరేబియా, అర్జెంటైనా, ఈజిప్ట్‌, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లకు చెందిన నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐదుగురు బ్రిక్స్‌ దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొని చర్చించిన మీదట ప్రత్యేకంగా గాజాను ప్రస్తావిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు. పాలస్తీనాకు బలమైన మద్దతుదారుగా నిలిచిన దక్షిణాఫ్రికా, గాజాలో పోరాటాన్ని వర్ణవివక్షపై తమ పోరాటంతో ముడిపెడుతోంది. ఈ యుద్ధంపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసింది. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసే పార్లమెంటరీ తీర్మానానికి తాము మద్దతిస్తామని పాలక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తెలిపింది
. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని చైనా కోరుతోంది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను పశ్చిమ దేశాలు రెచ్చగొడుతున్నాయని, ఇజ్రాయిల్‌ వ్యవహార శైలే ఈ ఘర్షణలకు కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విమర్శించారు.

Spread the love