– చుక్కల్లో సిలిండర్ ధర….తగ్గిన సబ్సిడీ
– ఇప్పటికీ కొందరికి కట్టెలు, పిడకలే ఆధారం
– అనారోగ్యానికి గురవుతున్న మహిళలు
న్యూఢిల్లీ : మహిళలకు కాలుష్యానికి తావులేని స్వచ్ఛమైన వంట గ్యాస్‌ను, తద్వారా ఆరోగ్యాన్ని అందించేందుకు తాము ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కుటుంబ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ప్రధాని మోడీ గొప్పగా చెప్పుకొచ్చారు. వంట కోసం సంప్రదాయిక పొయ్యి వాడే తన తల్లి పడుతున్న కష్టాలు చూసి చలించిపోయి మహిళల కన్నీరు తుడవాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామని కూడా సుభాషితాలు వల్లెవేశారు. అయితే ఈ పథకం అమలవుతున్న తీరు, ప్రభుత్వ విధానాలను గమనిస్తే లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రభుత్వం చెబుతున్న దాని కంటే అది విడుదల చేసిన సమాచారాన్ని పరిశీలిస్తే వాస్తవాలు బోధపడతాయి.
గ్రామీణ కుటుంబాలు, వెనుకబడిన తరగతుల వారికి ఇప్పటికీ వంట గ్యాస్ సరిగా అందుబాటులో లేదని 2019లో జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన సమాచారం స్పష్టం చేస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే 47 శాతం కుటుంబాలు కట్టెలు, పిడకల పైనే వంట చేస్తున్నాయి. దీనివల్ల మహిళలు పొగ, హానికరమైన కాలుష్య కారకాల బారిన పడి దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. సంప్రదాయిక పొయ్యిలలో ఉపయోగించేందుకు కట్టెలు సేకరించే పని కూడా వారి పైనే పడుతోంది. దీంతో వారు విద్య, ఉద్యోగం, సకాలంలో వైద్యం వంటి కనీస సౌకర్యాలకు సైతం నోచుకోవడం లేదు. దీనికి భిన్నంగా పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న కుటుంబాలు వంట గ్యాస్‌నే వినియోగిస్తున్నాయి. పట్టణాలలో 86 శాతం మంది గ్యాస్‌ను వాడుతుంటే కేవలం 7 శాతం మంది మాత్రమే కట్టెలు, పిడకలు ఉపయోగిస్తున్నారు. గ్రామీణ భారతంలో ఎస్టీలలో మూడో వంతు, ఎస్సీలలో సగం మంది మాత్రం ఎల్‌పీజీని వాడుతున్నారు. ఓబీసీలలో 55 శాతం మంది, ఇతరులలో 59 శాతం మంది కూడా గ్యాస్‌నే ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో ఉంటున్న ఎస్టీ, ఎస్సీలలో ఎక్కువ మంది మాత్రం ఇతర వనరులపై ఆధారపడుతున్నారు.
పీఎంయూఐ పథకం విజయవంత మైందంటూ ప్రధాని చెబుతున్న మాటలకు, ఎన్‌ఎస్‌ఓ గణాంకాలకు పొంతన కుదరడం లేదు. 2019 మార్చి 31 నాటికి దేశంలో ఉజ్వల పథకం కింద 7.19 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు. దీంతో దేశంలో ఎల్‌పీజీ వినియోగం 94.3 శాతానికి పెరిగింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి 2021 ఫిబ్రవరిలో రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ దేశంలో 99.5 శాతం మంది ఎల్‌పీజీ వాడుతున్నారని తెలిపారు. ఎన్‌ఎస్‌ఓ సర్వే మాత్రం ఇందుకు భిన్నమైన సమాచారం అందించింది. కుటుంబాలు ముఖ్యంగా గ్రామీణ కుటుంబాలు ఇప్పటికీ వంట కోసం ఎల్‌పీజీని తక్కువగానే వినియోగిస్తున్నారని ఆ సర్వే కుండబద్దలు కొట్టింది. కాగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగ్ నివేదిక ప్రకారం ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగం బాగా తగ్గింది. ఉజ్వల పథకం లబ్దిదారులలో చాలా మంది ఖాళీ సిలిండర్లను తిరిగి నింపుకోవడం లేదు. సగటు వార్షిక సిలిండర్ల వినియోగం తగ్గుతోందని నివేదిక చెబుతుంటే మంత్రి వర్యులు మాత్రం పెరు గుతోందని సెల విచ్చారు. ఉజ్వల లబ్దిదారులు ఖాళీ సిలిండర్లను అసలు నింపుకోకపోవడమో లేదా ఒకసారి మాత్రమే నింపుకోవడమో చేస్తున్నారు. దేశంలో సుమారు 8 కోట్ల లబ్దిదారులు ఉంటే వారిలో రెండు కోట్ల మంది ఖాళీ సిలిండర్లను పక్కన పెడుతున్నారు. లేదా కేవలం ఒకసారి మాత్రమే నింపుకుంటున్నారు. సిలిండర్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. 2016 మార్చిలో ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.513.50 ఉంది. 2020 మేలో సబ్సిడీని నిలిపేశారు. దీంతో వినియోగదారులు వెయ్యి రూపాయలకు పైగా వెచ్చింది మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉజ్వల వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఇస్తామని గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సిలిండర్లను నిర్ణీత ధరకు కాకుండా ప్రతి సిలిండర్ పైన రూ.200 సబ్సిడీ ఇస్తోంది. దీంతో పేదలపై పెను భారం పడుతోంది. ఓ వైపు సబ్సిడీ తగ్గుతుంటే మరోవైపు సిలిండర్ల ధర పెరిగిపోతోంది. మార్కెట్ ధరకు, సబ్సిడీకి మధ్య వ్యత్యాసం భారీగా ఉంటోంది. వాస్తవ పరిస్థితులను గమనిస్తే చివరికి ఉజ్వల పథకం కూడా ఇతర ప్రభుత్వ గిమ్మిక్కుల జాబితాలో చేరిపోయినట్లే కన్పిస్తోంది.