మైనారిటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి 

Bring the problems of minorities to the attention of the government– బీసీ కమీషన్ ను కోరిన ఎండీ.యాకూబ్ పాషా 
నవతెలంగాణ – పాల్వంచ 
రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్న మైనారిటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బీసీ కమీషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా కోరారు. మంగళవారం ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్ లో జరిగిన బీసీ కమీషన్ బహిరంగ విచారణలో ఆయన పాల్గొని, మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు, మైనారిటీ స్టడీ సర్కిల్ లతో పాటు ప్రతీ జిల్లాలో మైనారిటీ ఉర్దూ మీడియం కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మైనారిటీ ఒకేషనల్ జూనియర్ కాలేజ్, ఖాళీగా ఉన్న 900 ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు. బీసీ – ఇ పరిధిలోకి రాని ఓసీ ముస్లింలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని, కావున వారిని బీసీ-ఇ వర్గంలోకి చేర్చాలని సూచించారు. బీసీ-ఇ వర్గానికి చెందిన ముస్లింలకు ఈడబ్యుయస్ అందించాలని చెప్పారు. ముస్లింల దామాషా ప్రకారం మున్సిపల్ కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మైనారిటీ శాఖ వారు ప్రి మెట్రిక్ ఉపకార వేతనాలు రద్దు చేసినందున రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అందిస్తున్న విధంగా మైనారిటీ విద్యార్థులకు సైతం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు మొహమ్మద్ హుస్సేన్ ఖాన్, మహమ్మద్ ఫయీమ్, సయ్యద్ ఖాదర్ ఖాన్, గౌస్ పాషా, యూసుబ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love