బ్రిటన్ ప్రధాని నివాసంపై దాడి…

నవతెలంగాణ – లండన్ : బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో సునాక్‌ తన కార్యాలయంలోనే ఉన్నారు. లండన్ లోని ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని అధికార నివాసం గేటును కారు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ గా మారాయి. సాధారణంగా బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఎప్పుడూ గట్టి సెక్యూరిటీ ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. దేశ పార్లమెంటుకు ఇది దగ్గరి రూట్ కావడం విశేషం. ఇక్కడి ఎంట్రెన్స్ వద్ద గతంలోనే లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. 1991లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్‌లో బాంబు దాడులకు పాల్పడడంతో ఇక్కడ భద్రతను పెద్ద ఎత్తున పెంచారు. కాగా తాజా ఘటన వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటన్నది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.