విశాఖలో తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. !

నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖలో నిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ (నీటిపై తేలే వంతెన)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సముద్రంలో ఈ వంతెనను నిర్మించారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభకు ఎన్నికైన వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అయితే ఒక్క రోజు కూడా గడవకుండానే ఈ బ్రిడ్జ్ తెగిపోయింది. వంతెన చివరి భాగం సముద్రంలో కొంత దూరం కొట్టుకుపోయింది. అయితే, ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు ఎవరూ వెళ్లకుండా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చేపట్టింది. జనవరి మొదటి వారంలో పనులను చేపట్టి చాలా వేగంగా పూర్తి చేశారు. రూ. 1.60 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. రెండో రోజే బ్రిడ్జ్ తెగిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో అక్కడున్న సందర్శకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love