– తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు ఎర
– పట్టించుకోని అధికారులు
నవ తెలంగాణ-మల్హర్ రావు
ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వాలని పిఏసిఎస్,డిసిఎంఎస్ ద్వారా మండలంలో 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాల్లో పోశారు.అయితే రైతుల ధాన్యం సిబ్బంది విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రకృతి రైతన్నలను పగబట్టడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తూ తిప్పలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రయివేటు వడ్ల వ్యాపారులు మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూoడ్ల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్దకు గుట్టుచప్పుడు కాకుండా చేరుకొని మేము మీ ధాన్యాన్ని క్వింటాలుకు రూ.1800 లకు కొనుగోలు చేస్తాం, డబ్బులు నగదు ఇస్తామని రైతులను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ప్రయివేటు దళారులు ప్రతి సంవత్సరం కొనుగోలు కేంద్రాల పరిధిలోకి వెళ్లి ధాన్యం సేకరించడం పరిపాటిగా మారింది. దళారులు ఎక్కువగా మధ్యాహ్నం లేదా రాత్రి వెళల్లో కేంద్రాల వద్దకు చేరుకొని రైతులకు మాయమాటలు చెప్పి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం క్వింటాలకు రూ.గ్రేడ్ ఏ కు రూ.2.180, గ్రేడ్ బికి రూ.2.150 మద్దతు ధర ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే రైతు క్వింటాల్ కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోయే అవకాశం ఉంది.కొనుగోలు కేంద్రాల వద్దకు దళారులు రావద్దని ఆదివారం తాడిచెర్లలో ఓ రైతు దళారితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అలాగే కొందరు దళారులు గత రబీ సీజన్ లో వందలాది లారీల ధాన్యం కొనుగోలు చేసి వచ్చిన లాభాన్ని పంపకాల్లో తేడా వచ్చి బజారుకెక్కిన విషయం విదితమే.ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించడానికి పంపిన బార్దన్ సైతం ఓ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు ప్రయివేటు దళారులకు సరఫరా చేస్తున్నట్లుగా బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎది ఏమైనా రైతుల నట్టేట ముంచుతున్న దళారుల భరతం పత్తి దళారులకు సహకరిస్తున్న నిర్వాహకులు,సిబ్బందిపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.