కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో బిత్తిరైన బి.ఆర్.ఎస్, బిజెపి పార్టీలు

– జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి 
నవతెలంగాణ- కంటేశ్వర్:
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో బిత్తిరైన టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు ఒక గుణపాఠమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ లో సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో కూడిన అభయహస్తం గ్యారంటీ కార్డు గురించి వివరించేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హంధాన్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభకు వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ కార్యక్రమం విజయవంతం కోసం శ్రమించిన జిల్లా నాయకులకు,కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ  అన్నట్టుగా బిజెపి బీఆర్ఎస్  ఎంఐఎం పార్టీలు ఒకటేనని దానికి ప్రత్యేక ఉదాహరణ సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ సభ ఉన్నందున దానిని భగ్నం చేయాలని ఉద్దేశంతో వారంతా కలిసి వేరువేరుగా సభలు నిర్వహించి కాంగ్రెస్ విజయభేరి సభను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారని, కానీ ప్రజలందరూ వారి కుట్రలను పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ విజయభేరి సభకు భారీగా తరలివచ్చారని ఆయన అన్నారు. మూడు పార్టీలు నిర్వహించిన సభకు కాంగ్రెస్ పార్టీ సభ కోసం బయలుదేరి పోలీసుల నిర్లక్ష్యం వల్ల మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ లో నిలిచిపోయిన జనమంతా కూడా లేరని ఆయన ఎద్దేవా చేశారు. విజయబేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలు బిఆర్ఎస్ మరియు బిజెపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలతో కూడిన అభయహస్తం పథకాలను మోహన్ రెడ్డి గారు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతినెల 2500 రూపాయలతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుందని, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుందని,రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా 15 వేల రూపాయలు అందిస్తుందని, రైతుబంధు పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం భూస్వాములకు మేలు చేసే విధంగా మాత్రమే దానిని రూపొందించిందని కానీ రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు కూడా ప్రతి ఏటా 15 వేల రూపాయలు అందిస్తుందని ఆయన తెలిపారు.భూమిలేని వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు సంవత్సరానికి అందజేస్తుందని, ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం  ఐదు లక్షల రూపాయలు అందజేస్తుందని, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని అందజేస్తుందని, యువ వికాసం ద్వారా విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు తో పాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుందని అలాగే చేయూత పథకం ద్వారా 4000 రూపాయల నెలవారి పింఛను అందిస్తుందని,10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందజేస్తుందని ఒక రకంగా ఇది ఉచిత వైద్యం గా పరిగణించాలని ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది ప్రజలు లబ్ధి పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకాలన్నీ చూసి బిత్తర పోయిన కేటీఆర్ మరియు కవిత  కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, కవిత  ఒక అడుగు ముందుకేసి మహిళా బిల్లు గురించి మాట్లాడుతున్నారని మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని, మహిళా బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయహస్తం గ్యారంటీ పథకాల వల్ల కేటీఆర్ కు మరియు కవిత కు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అందుకే కాంగ్రెస్ ప్రకటించిన పథకాలపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఎవరండీ కుట్రలు చేసిన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని ఆయన అన్నారు. అలాగే అభయ హస్తం గ్యారెంటీ కార్డుతో కూడిన కరపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు ప్రతి ఇంటి ఇంటికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే గ్యారంటీ స్కీముల గురించి తెలియజేసి వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.టీపీసీసీ ఉపాధ్యక్షుడు తహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గానీ సోనియా గాంధీ  గాని మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ  గరీబి హటావో పేరుతో దేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేయడంతో పాటు బ్యాంకుల జాతీయకరణ లాంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  సాంకేతిక రంగంలో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఎంతో క్లిష్టమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రాజకీయంగా కొంత నష్టపోతామని తెలిసినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, ఇలాంటి నిర్ణయాలు సోనియా గాంధీ  నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. కొన్ని నెలల క్రితం కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలో గ్యారంటీ కార్డుతో కూడిన హామీలను ఇచ్చిందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని, గెలిపించిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని రేపు తెలంగాణ లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కర్ణాటక తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ హామీలను నెరవేర్చుతుందని ఆయన తెలియజేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలతో కూడిన అభయ హస్తం గ్యారెంటీ కార్డును ప్రదర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు,రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్,యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, సేవాలాల్ అధ్యక్షుడు సంతోష్, బీసీ సెల్ అధ్యక్షులు నరేంద్ర గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, సిరికొండ గంగారెడ్డి ,కేశ రాజు ,నూరుద్దీన్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love