– లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్రకు బీఆర్‌ఎస్ తెరలేపిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపిం చారు. అధికారం కోల్పోయిన అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారు లపై దాడి వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని పేర్కొన్నారు. రైతులను నష్టపెట్టాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదనీ, వారి సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. పదేండ్ల పాలనలో రైతులపై ఉక్కు పాదం మోపిన బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మొసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర కోసం అందోళన చేపట్టిన మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర ఆ పార్టీదని అన్నారు. మల్లన్న సాగర్ భూసేకరణలో ప్రభుత్వం పెట్టిన బాధలను భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. రైతులను అడుగడుగునా దగా చేసిన బీఆర్‌ఎస్ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.