– గుడిసెల తొలగింపు
– దాడి చేసిన వారిపై చర్యలకు సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ప్రభుత్వ భూమిలో రెండేండ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలపై బీఆర్‌ఎస్ నాయకుడు, అతని అనుచరులు దాడి చేశారు. గుడిసెలను కూల్చేశారు. అడ్డుకోబోయిన మహిళలపై దాడి చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. బాధితులు, సీపీఐ(ఎం) నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ నగర పరిధిలోని గోపాలపురం శివారులోని సర్వే నెంబరు 89లోని ప్రభుత్వ భూమిలో కొందరు రియల్టర్లు, భూ ఆక్రమణదారులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు, ఆలయాలు నిర్మించారు. శ్మశాన వాటికల పేరుతో స్థానిక బీఆర్‌ఎస్ కార్పొరేటర్, అతని అనుచరులు ఆక్రమించారు. మిగిలిన కొంత ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది నెలల కిందట గుడిసెవాసులపై కొందరు దాడి చేశారు. అప్పుడు సామరస్యంగా ఇరువైపులా కూర్చొని మాట్లాడి హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. మళ్లీ గురువారం స్థానిక 56వ డివిజన్ కార్పొరేటర్ సునీల్ కుమార్ తన అనుచరులతో వచ్చి, ఇక్కడ మా శ్మశాన వాటిక ఉందని, గతంలో ప్రభుత్వం మాకు రాసిచ్చిందని దౌర్జన్యం చేసి గుడిసెలను తొలగించారు. అడ్డుకోబోయిన మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి సీపీఐ(ఎం) నేతలు చికిత్స చేయించారు. అనంతరం యూనివర్సిటీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సీపీఐ(ఎం) హనుమకొండ మండల కార్యదర్శి వాంకుడోత్ వీరన్న తెలిపారు. దళితులు, గిరిజనులపై దాడి చేసి గుడిసెలు తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏండ్లు దాటినా ఇవ్వకపోవడంతో భూ పోరాటం నిర్వహించి ప్రభుత్వ భూమిని కాపాడి నిరుపేదలకు గుడిసెలు వేయించామని చెప్పారు. ఇది సహించలేని బీఆర్‌ఎస్ నేతలు పేదల గుడిసెలపై దాడికి దిగడం సరైనది కాదన్నారు. అకారణంగా దాడి చేసిన 56వ డివిజన్ కార్పొరేటర్ సునీల్‌ను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, లేదంటే కార్పొరేటర్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.ఉప్పలయ్య, నాయకులు కుక్కముడి రవీందర్, వల్లెపు రాజు, వల్లేపు లింగమూర్తి, బొంత కొమురెల్లి, ఉమాదేవి, ఇమ్మడి కవిత, ముదురు మంజుల, రమాదేవి, బానోతు వెంకన్న, జగన్, రాధిక తదితరులు పాల్గొన్నారు.