– రైతులకు 24 గంటల విద్యుత్ అనేది కాంగ్రెస్ విధానమే :టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ విమర్శించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వటమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పలువురు నేతలు వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. 24 గంటల కరెంట్ పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్ విద్యుత్ కాల్పులు జరిగినప్పుడు టీడీపీలో ఉన్న కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఆనాడు టీడీపీ సర్కారు విద్యుత్ కాల్పుల్లో కేసీఆర్ భాగస్వామి అని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్ వెనుక ఎంత అవినీతి జరిగిందో తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. విద్యుత్ కొనుగోలు అవినీతిలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు. రైస్ మిల్లర్లతో కలిసి ఆ కుటుంబం దోపిడీకి పాల్పడిందన్నారు.
ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పథకమే : మల్లు రవి
ఉచిత విద్యుత్‌కు పేటెంట్ హక్కు కాంగ్రెస్‌దేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చెప్పారంటూ పార్టీ ఉపాధ్యక్షులు మల్లు రవి చెప్పారు. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల సమావేశంలో ఒక ప్రశ్నకు మాధానంగా ఉచిత విద్యుత్ గురించి రేవంత్ మాట్లాడారని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ఆయన వ్యాఖ్యానించారని చెప్పారు. అక్కడ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించలేదని వివరించారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు పని చేస్తామన్నారు. .రైతులను తప్పు దోవ పట్టించేందుకుకే మంత్రి కేటీఆర్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
విద్యుత్‌ను రూ 36వేల కోట్లకు
ఎందుకు కొంటున్నారు : అద్దంకి దయాకర్
పవర్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయితే, మరి రూ 36వేల కోట్లకు ఎందుకు కొంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 12,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2,000 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం ఖర్చు పెడుతోందని చెప్పారు. బీజేపీకి ఎంఐఎం రహస్య మిత్రుడనీ, వారికి సీఎం కేసీఆర్ బహిరంగ మిత్రుడని ఆరోపించారు.
24 గంటల కరెంట్ ఇచ్చే గ్రామాన్ని చూపించగలరా? : సుంకేట అన్వేష్‌రెడ్డి
రైతులకు 24 గంటల కరెంట్ వచ్చే ఒక్క గ్రామాన్ని చూపించగలరా? అని కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ సుంకేట అన్వేష్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రెండు నెలలుగా వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే చుక్క నీరైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కాలువల ద్వారా నీళ్లు ఇస్తామన్న కేసీఆర్… చుక్క నీరు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉచిత విద్యుత్‌పై కట్టుబడి ఉందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ నేత కోదండరెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్సే రేవంత్‌రెడ్డి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాంగ్రెస్సే రేవంత్ రెడ్డి…రేవంత్‌రెడ్డే కాంగ్రెస్ అని అనడం జోక్ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్‌లో పీసీసీ నిర్ణయం ఫైనల్ కాదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో పూర్తిగా నాకు తెలియదు అన్నారు. సీతక్క సీఎం అనే చర్చ అనవసరమని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తామంటూ బుధవారం రేవంత్ ప్రకటిస్తారని తెలిపారు. రైతులు బీఆర్‌ఎస్ మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అంటే రైతులు. రైతులంటే కాంగ్రెస్. దేశంలో రైతులకు అనుకూలంగా పని చేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వక్రీకరించింది. మంత్రులంతా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు’ అని విమర్శించారు.