బీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ

BRS hit back in High Court– రూ.లక్ష జరిమానా విధింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ భవనం కూల్చివేతకు నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఇదే అభ్యర్థనపై గతంలో పిటిషన్‌ దాఖలు చేస్తే హైకోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. సంబంధిత వ్యవస్థల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే ఆ పార్టీ మరోసారి అదే అంశంపై పిటిషన్‌ దాఖలు చేయడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వధా చేసినందుకు రూ. లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వినోద్‌కుమార్‌ బుధవారం తీర్పు చెప్పారు. చట్ట ప్రకారమే కూల్చివేత నోటీసులు జారీ చేసినట్టు కార్పొరేషన్‌ న్యాయవాది చెప్పారు. కూల్చివేత ఉత్తర్వులు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆ పార్టీ తరఫున పిటిషన్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీందర్‌ తరపు న్యాయవాది కోరారు. భవన నిర్మాణ క్రమబద్ధీకరణ ఉత్తర్వులకు కార్పొరేషన్‌ నిరాకరించిందని చెప్పారు. కూల్చివేత ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇక్కడ వర్తించవని స్పష్టం చేసింది.
కార్డెన్‌ సెర్చ్‌లో స్టేకు హైకోర్టు నిరాకరణ
మిషన్‌ చబుత్రా, ఆపరేషన్‌ రోమియో, అర్ధరాత్రి కౌన్సిలింగ్‌.. ఇలా పలు పేర్లతో హైదరాబాద్‌ సిటీ పోలీసులు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ చేయడానికి సవాల్‌ చేసిన కేసులో స్టే ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఆయా కార్యకలాపాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ఆ లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పోలీసులు ఇష్టానుసారంగా సోదాలు చేయడంపై సోషల్‌ వర్కర్‌ మక్సూద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. డీజీపీ, హైదరాబాద్‌ సీపీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది.

Spread the love