రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ దే హ్యాట్రిక్ 

నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు చెప్పాలి  
– ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
రానున్న ఎన్నికలలో హుస్నాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ దే హ్యాట్రిక్ ఉంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం కోసం ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలన్నారు.  పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయనుందని పేర్కోన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పకుండా ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.రోజు రోజుకు శ్రుతి మించుతున్న ప్రతిపక్ష పార్టీల దుర్మార్గ చర్యలను ఎండ గట్టి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సిద్దం కావాలని,ఎప్పటికప్పుడు ప్రజలతో మమైకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Spread the love