నవతెలంగాణ – హైదరాబాద్: కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ తెల్లవారుజామున ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావును కూడా గృహ నిర్బంధం చేశారు. కేపీహెచ్ బీ డివిజన్ లో హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తున్న నేపథ్యంలోనే వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. తాము వేలంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వేలంలో పొల్గొనేందుకు ఇప్పటికే డీడీలు కూడా తీసుకున్నామని చెప్పారు. వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడంపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాలను ప్రభుత్వం తరపున వేలం వేయడమేమిటని ప్రశ్నించారు.